అక్తర్‌ వ్యాఖ్యలకు కపిల్‌ కౌంటర్‌

9 Apr, 2020 15:37 IST|Sakshi

ఆ డబ్బు అవసరం లేదు బాస్‌

ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లతో రిస్క్‌ చేయాలా?

న్యూఢిల్లీ:  పాకిస్తాన్‌ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంతో పాటు.. పాకిస్తాన్‌లోనూ కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్న కారణంగా ఇరు దేశాలు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడితే బాగుంటుందని సూచించాడు. తద్వారా వచ్చే విరాళాలు ఇరు దేశాలు కరోనాపై చేస్తున్న పోరాటంలో ఉపయోగపడతాయని అక్తర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకుండా.. కేవలం టీవీలకు మాత్రమే పరిమితం చేయాలని పేర్కొన్నాడు. దీనిపై ఇప్పటివరకూ భారత్‌ నుంచి స్పందన రాకపోగా, తొలిసారి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ మాత్రం కౌంటర్‌ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లతో రిస్క్‌ చేయాల్సిన అవసరం లేదంటూ అక్తర్‌కు చురకలంటించాడు. (భారత్‌ సాయం కోరిన అక్తర్‌)

‘భారత్‌-పాక్‌ల మధ్య సిరీస్‌ జరగాలని కోరడం అతని అభిప్రాయం. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కరోనా కట్టడి కోసం భారత్‌ విరాళాలు కోసం ఇలా సిరీస్‌లు సిద్ధ కావాల్సిన అవసరం లేదు. మా దగ్గర సరిపడా డబ్బు ఉంది.  తాజా పరిస్థితుల్లో ఏది ముఖ్యం. .ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కడం కావాలి. అది వదిలి క్రికెట్‌ సిరీస్‌లు ఏమిటి. ఇప్పటికే కరోనా సంక్షోభంతో ప్రభుత్వానికి బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళం ఇచ్చింది. ఇంకా అవసరమైతే కూడా ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే ఈ పరిస్థితుల్లో భారత్‌ క్రికెటర్లు నిధులు కోసం మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు.  క్రికెటర్లతో ఎలా రిస్క్‌ చేస్తాం. అసలు మూడు మ్యాచ్‌లతో ఎంత నగదును సంపాదిస్తాం. నాకు తెలిసినంత వరకూ ఐదు-ఆరు నెలల పాటు క్రికెట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరమేలేదు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ప్రజల ప్రాణాలను కాపాడటంపైనే దృష్టి పెట్టాలి. అదే సమయంలో పేద వారి ఆకలి బాధను తీర్చాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వైరస్‌పై ఎవరూ రాజకీయాలు చేయొద్దు. నేను ఇప్పటికే టీవీల్లో చూశా. ఈ వైరస్‌ నియంత్రణలో కూడా రాజకీయ కోణాలు కనబడుతున్నాయి. ఇది సరైనది కాదు’ అని కపిల్‌ పేర్కొన్నాడు. (ధోని గేమ్‌ మార్చాడు.. అందుకే పట్టు కోల్పోయాడు)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు