మనం కొంచెం ఎక్కువ సమానం

3 Dec, 2015 23:51 IST|Sakshi
మనం కొంచెం ఎక్కువ సమానం

  తొలి రోజు భారత్ 231/7
  సెంచరీకి చేరువలో రహానే
  దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు

 
 సిరీస్‌లో తొలి మూడు టెస్టుల్లో మొదటి రోజు ఏకపక్షంగా భారత్ వైపే మొగ్గింది. టాస్ మొదలు ఏ దశలోనూ దక్షిణాఫ్రికాకు కనీస అవకాశం కూడా దక్కలేదు. అయితే ఎట్టకేలకు కోలుకున్న సఫారీలు ఢిల్లీ మ్యాచ్‌లో కాస్త ఆధిపత్యం ప్రదర్శించారు. ఏడు వికెట్లు తీసి సంతృప్తి పడ్డారు.
 
గత పిచ్‌లతో పోలిస్తే బ్యాటింగ్‌కు మెరుగ్గా కనిపించిన వికెట్‌పై టీమిండియా తడబడింది. ఆరంభంలో సీమర్లు, ఆ తర్వాత పీడిట్ జట్టును కట్టడి చేశారు. అయితే విదేశాల్లో మినహా సొంతగడ్డపై ఇప్పటివరకు ప్రభావం చూపించని రహానే కీలక సమయంలో చక్కటి ఇన్నింగ్స్‌తో తన విలువ ప్రదర్శించాడు.
 
మొదటి రోజు స్కోరు చూస్తే ఎక్కువగా కనిపించకపోయినా, ముందుగా బ్యాటింగ్ చేస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. శుక్రవారం భారత్ తమ స్కోరును కనీసం 300కు చేరిస్తే పైచేయి సాధించినట్లే. మొత్తానికి మొదటి రోజు ఇరు జట్లు దాదాపుగా సమ స్థితిలో నిలిచినా... భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది.
 
న్యూఢిల్లీ: ఆటకంటే పిచ్‌లపైనే ఎక్కువ చర్చ జరిగిన భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఎట్టకేలకు బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సరైన పోటీ సాగింది. ఫలితంగా గురువారం ఇక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అజింక్య రహానే (155 బంతుల్లో 89; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ముందుండి నడిపిస్తూ సెంచరీకి చేరువయ్యాడు. రహానే, కోహ్లి (62 బంతుల్లో 44; 7 ఫోర్లు) కలిసి నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ పీడిట్ 4 వికెట్లు పడగొట్టగా, పొదుపుగా బౌలింగ్ చేసిన అబాట్‌కు 3 వికెట్లు దక్కాయి. వెలుతురు తగ్గడంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆరు ఓవర్ల ముందే నిలిపేశారు. రహానేతో పాటు అశ్విన్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
 
 
కోహ్లి బ్యాడ్‌లక్
చక్కటి బ్యాటింగ్‌తో ఈ సిరీస్‌లో తన అత్యధిక స్కోరు నమోదు చేసిన కోహ్లి భారీ స్కోరు సాధించే జోరులో కనిపించాడు. అయితే చిత్రమైన రీతిలో అవుట్ కావడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. పీడిట్ వేసిన బంతిని అతను బలంగా స్లాగ్ స్వీప్ ఆడాడు. బౌండరీ దాటేంత ఫోర్స్ ఆ షాట్‌లో కనిపించింది. దానిని తప్పించుకునేందుకు షార్ట్‌లెగ్ ఫీల్డర్ బవుమా వెనక్కి తిరిగాడు. అయితే అతని తొడను తాకిన బంతి రీబౌండ్‌లో గాల్లోకి లేచింది. ఈ సమయంలో చురుగ్గా ఉన్న కీపర్ విలాస్ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి చక్కటి క్యాచ్ అందుకోవడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు.
 
ఆ క్యాచ్ పట్టుంటే...
భారత ఇన్నింగ్స్‌కు మూల స్థంభంలా నిలిచిన రహానే ఇంకా క్రీజ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. తొలి రోజు చివర్లో అతను అవుటై ఉంటే భారత్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. 78 పరుగుల వద్ద పీడిట్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఆమ్లా సునాయాస క్యాచ్ వదిలేశాడు. రెండు చేతులతో దానిని అందుకున్నా నియంత్రించుకోలేకపోవడంతో రహానేకు అదృష్టం కలిసొచ్చింది.
 
తొలి సెషన్: విజయ్ విఫలం
టాస్ నెగ్గిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మిశ్రా స్థానంలో ఉమేశ్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఆరంభంలో  వికెట్ పేసర్లకు అనుకూలించడంతో మోర్కెల్, అబాట్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఫలితంగా భారత్ తొలి గంటలో 16 పరుగులు మాత్రమే చేసింది. 10 పరుగుల వద్ద అబాట్ బౌలింగ్‌లో అవుటైనా... నోబాల్ కావడంతో బయటపడిన విజయ్ (12) ఆ తర్వాత కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.  తొలి పరుగు కోసం 18 బంతులు తీసుకున్న ధావన్ (85 బంతుల్లో 33; 4 ఫోర్లు) ఆ తర్వాత ఆకట్టుకున్నాడు.
 ఓవర్లు: 26, పరుగులు: 60, వికెట్లు: 1
 
రెండో సెషన్: టపటపా వికెట్లు
లంచ్ తర్వాత మూడో ఓవర్లో పీడిట్ చక్కటి బంతితో ధావన్‌ను అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే పుజారా (14)ను అబాట్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కోహ్లి, రహానే కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.  ఎలాంటి ఇబ్బందీ లేకుండా చకచకా ఆడిన వీరిద్దరి మధ్య 67 బంతుల్లోనే అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. అయితే పీడిట్ బౌలింగ్‌లో కోహ్లి అనూహ్యంగా వెనుదిరగడం భారత్‌ను దెబ్బ తీసింది.  ఆమ్లా సునాయాస క్యాచ్ వదిలేసినా... నిర్లక్ష్యపూరిత షాట్ ఆడి రోహిత్ శర్మ (1) లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. అబాట్ మరో చక్కటి బంతితో సాహా (1)ను బౌల్డ్ చేయడంతో  భారత్ 139 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.
 ఓవర్లు: 27.5, పరుగులు: 79, వికెట్లు: 5
 
మూడో సెషన్: రహానే దూకుడు  ఓవర్లు: 30.1, పరుగులు: 92, వికెట్లు: 1
ఈ సెషన్‌లో జడేజా (59 బంతుల్లో 24; 3 ఫోర్లు) సహకారంతో రహానే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 47 పరుగులే చేసిన రహానే... ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగినట్లుగా ఆడాడు. పీడిట్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది అతను 91 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అబాట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జడేజా వెనుదిరగడంతో 59 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా రహానే, అశ్విన్ కలిసి రోజు ముగించారు.

స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) ఆమ్లా (బి) పీడిట్ 12; ధావన్ (ఎల్బీ) (బి) పీడిట్ 33; పుజారా (బి) అబాట్ 14; కోహ్లి (సి) విలాస్ (బి) పీడిట్ 44; రహానే (బ్యాటింగ్) 89; రోహిత్ (సి) తాహిర్ (బి) పీడిట్ 1; సాహా (బి) అబాట్ 1; జడేజా (సి) ఎల్గర్ (బి) అబాట్ 24; అశ్విన్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (84 ఓవర్లలో 7 వికెట్లకు) 231.
 
 వికెట్ల పతనం: 1-30; 2-62; 3-66; 4-136; 5-138; 6-139; 7-198.
 బౌలింగ్: మోర్కెల్ 17-5-40-0; అబాట్ 17-6-23-3; పీడిట్ 34-5-101-4; తాహిర్ 7-1-36-0; ఎల్గర్ 5-0-15-0; డుమిని 4-0-12-0.

>
మరిన్ని వార్తలు