టీమిండియా వన్డే చరిత్రలో ఇదే తొలిసారి..

11 Mar, 2019 13:55 IST|Sakshi

మొహాలి: భారత క్రికెట్‌ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో 350కి పైగా పరుగుల్ని కాపాడుకోవడంలో విఫలం కావడం ద్వారా  భారత్ తొలిసారి అపప్రథను సొంతం చేసుకుంది. టీమిండియా వన్డే చరిత్రలో 350, అంతకంటే ఎక్కువ పరుగుల్ని కాపాడుకోవడంలో వైఫల్యం చెందడం ఇదే తొలిసారి. గతంలో తొలి ఇన్నింగ్స్‌ల్లో 350, అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఐదు సందర్భాల్లో భారత్‌ నమోదు చేయగా, ఆ మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురుకాలేదు. ఆసీస్‌తో మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 358 పరుగులు చేసినా దాన్ని కాపాడుకోవడంలో వైఫల్యం చెందింది.

మరొకవైపు ఆసీస్‌కు ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కింది. అంతకుముందు ఆస్ట్రేలియా  ఛేజింగ్‌ చేసిన అత్యధిక పరుగుల రికార్డు 334. 2011లో సిడ్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఆసీస్‌ ఆ ఫీట్‌ సాధించింది. ఇప్పుడు దాన్ని సవరిస్తూ సరికొత్త రికార్డు లిఖించింది. ఇదిలా ఉంచితే ఒక వన్డే మ్యాచ్‌ల్లో రెండు జట్లూ 350కి పరుగులు చేయడం 12వసారి. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల ఛేజింగ్‌ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో 435 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించింది.

మరిన్ని వార్తలు