భారత్‌కు పతకాల పంట 

2 Apr, 2019 01:25 IST|Sakshi

ఆసియా షూటింగ్‌లో 25 పతకాలు

న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్‌ గన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు సత్తా చాటుకున్నారు. పోటీలకు ఆఖరి రోజైన సోమవారం భారత్‌ ఐదు స్వర్ణాలు గెలుచుకుంది. దీంతో పసిడి పతకాల సంఖ్య 16కు చేరుకుంది. ఓవరాల్‌గా భారత్‌ 25 పతకాలు గెలుచుకుంది. ఇందులో ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి. యశ్‌వర్ధన్, శ్రేయ అగర్వాల్‌ వ్యక్తిగత, టీమ్, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లను కలుపుకొని మూడేసి స్వర్ణాలు గెలుపొందారు. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో బంగారు పతకం నెగ్గిన యశ్‌... కెవల్‌ ప్రజ్‌పతి, ఐశ్వర్య్‌ తోమర్‌లతో కలిసి టీమ్‌ ఈవెంట్‌లో మరో పసిడి చేజిక్కించుకున్నాడు.

శ్రేయతో కలిసి మిక్స్‌డ్‌ ఈవెంట్‌లోనూ స్వర్ణం నెగ్గాడు. జూనియర్‌ మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్‌ ఈవెంట్‌తో పాటు మెహులీ ఘోష్, కవి చక్రవర్తిలతో కలిసి టీమ్‌ ఈవెంట్‌లోనూ శ్రేయ అగర్వాల్‌ బంగారు పతకాల్ని గెలిచింది. 10 మీ. ఎయిర్‌రైఫిల్‌ పోటీలో మెహులీ మూడో స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకోగా... కవి చక్రవర్తి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఈవెంట్‌ ముగిసిందో లేదో మరో చాంపియన్‌షిప్‌కు భారత షూటర్లు సిద్ధమయ్యారు. యూఏఈలో 5 నుంచి జరుగనున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీలో భారత్‌ పాల్గొంటుంది.   

మరిన్ని వార్తలు