187 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

25 Jan, 2018 08:11 IST|Sakshi

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 187 ఆలౌట్‌

మరోసారి భారత బ్యాట్స్‌మన్‌ విఫలం

అర్ధశతకాలతో రాణించిన కోహ్లి, పుజారా

తొలి రోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 6/1

జొహన్నెస్‌బర్గ్‌ : వేదిక మారినా.. జట్టులో మార్పులు చేసినా అదే ఆట..అదే తీరు..!  దక్షిణాఫ్రికా ఫేస్‌ బలగానికి మరోసారి భారత్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. కెప్టెన్‌ కోహ్లి, పుజారాల అర్ధసెంచరీలు మినహా భారత్‌ బ్యాట్స్‌మెన్‌ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు.  దీంతో భారత్‌ కేవలం187 పరుగులకే కుప్పకూలింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు లోకేష్‌ రాహుల్‌(0), మురళీవిజయ్‌(8)లు మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం క్రీజులో వచ్చిన పుజారా, కోహ్లిలు నిలకడగా రాణించారు. ఆచితూచి ఆడుతూ.. సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. పుజారా అయితే తొలి పరుగుకు ఏకంగా 54 బంతులు ఎదుర్కొన్నాడు. కోహ్లి సైతం సఫారీ బౌలర్ల వేగవంతమైన బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటు వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే  రబాడ వేసిన 20.1వ బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో ఉన్న ఫిలాండర్‌ సరిగ్గా అంచనా వేయలేక నేలపాలు చేశాడు. ఈ లైఫ్‌ను అందిపుచ్చుకున్న కోహ్లి(54, 101 బంతుల్లో 9  ఫోర్లతో) కెరీర్‌లో 16 హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆవెంటనే లుంగిసాని బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్‌ మొత్తానికి ఈ పరుగులే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

నిరాశ పరిచిన రహానే
తొలి రెండు టెస్టు మ్యాచుల్లో  అజింక్యా రహానేకు అవకాశం ఇవ్వకపోవడంపై కెప్టెన్‌ కోహ్లి సీనియర్‌ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శల ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ స్థానంలో అవకాశం కల్పించగా రహానే సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మోర్కెల్‌ వేసిన 51.4 ఓవర్‌లో రహానే(9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పార్దీవ్‌ పటేల్‌ పుజారా ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించాడు.

కోహ్లి బాటలో పుజారా..
కోహ్లిలానే హాఫ్‌ సెంచరీ అనంతరం పుజారా పెవిలియన్‌కు చేరాడు. తనదైన బ్యాటింగ్‌ శైలితో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్ష నిలిచిన పుజారా 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో కెరీర్‌లో 17 అర్ధసెంచరీ సాధించాడు. ఆ వెంటనే  ఫెహ్లుక్‌వాయో వేసిన 61.3వ బంతికి ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్‌ వచ్చిన బంతి పుజారా బ్యాట్‌ అంచుకు తగిలి కీపర్‌ డికాక్‌ చేతుల్లో పడింది. అర్ధశతకం సాధించడానికి పుజారా నాలుగు గంటల సమయం తీసుకోవడం విశేషం. ఆ వెంటనే భారత్‌ పార్దీవ్‌పటేల్‌(2), హార్దిక్‌ పాండ్యా(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. జట్టు స్కోర్‌ 144 పరుగుల వద్ద భారత్‌ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం విశేషం.

పర్వాలేదనిపించిన భువనేశ్వర్‌ 
అనంతరం క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్‌(30) పర్వాలేదనిపించాడు. అందివచ్చిన బంతులను బౌండరీలకు తరలిస్తూ జట్టు స్కోర్‌ను ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఇతర టేయిలండర్ల నుంచి సాయం అందలేదు. దీంతో భారత్‌ 187 పరుగులు చేయగలిగింది. మహ్మద్‌ షమీ 8 పరుగులు చేయగా.. ఇషాంత్‌ డకౌట్‌ అయ్యాడు. చివర్లో భువీ అవుటవ్వడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. బుమ్రా(0) నాటౌట్‌గా నిలిచాడు. సఫారీ బౌలింగ్‌లో రబడా మూడు వికెట్లు తీయగా.. మోర్కెల్‌, ఫిలాండర్‌, ఫెహ్లుక్‌వాయోలకు తలో రెండు వికెట్లు తీశారు.  లుంగిసానికి ఒక వికెట్‌ దక్కింది.

తొలి వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ సఫారీ ఓపెనర్‌ ఆడిన్‌ మార్క్‌రమ్‌(2) పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రబడాతో డీన్‌ ఇల్గర్‌(4) మరో వికెట్‌ కోల్పోకుండా ఆచితూచి ఆడాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 6 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి 6 పరుగులు చేసింది.

ffff

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు