ఐపీఎలా... మజాకా!

25 Apr, 2018 01:31 IST|Sakshi

ఐసీసీ మెగా ఈవెంట్‌ను శాసించిన భారత లీగ్‌

ప్రపంచకప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ తేదీ మార్పు

జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి పోరు

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ధాటికి ఏకంగా వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ కూడా దిగొచ్చింది. ఐపీఎల్‌కు, అంతర్జాతీయ సిరీస్‌లకు మధ్య 15 రోజుల వ్యత్యాసం ఉండాలన్న లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరడం... అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఎప్పుడో ఖాయం చేసిన షెడ్యూల్‌ను కాదని తాజా మార్పులతో  ఐసీసీ  కొత్త షెడ్యూల్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా టీమిండియా మెగా ఈవెంట్‌ పోరును దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభించనుంది. జూన్‌ 5న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ముందనుకున్న షెడ్యూల్‌ ప్రకారమైతే జూన్‌ 2న ఈ మ్యాచ్‌ జరగాల్సింది. అయితే ఐపీఎల్‌–12 సీజన్‌ మార్చి 29న ప్రారంభమై మే 19న ముగియనుంది. దీంతో 15 రోజుల తేడా కోసం ప్రపంచకప్‌ మ్యాచ్‌ను మూడు రోజులు వెనక్కి జరపాల్సి వచ్చింది. విశ్వవ్యాప్తమైన ఆసక్తి ఉండే దాయాదుల సమరం జూన్‌ 16న జరుగుతుంది. ఓల్డ్‌ ట్రాఫర్డ్‌లో భారత్, పాకిస్తాన్‌లు అమీతుమీ తేల్చుకుంటాయి.

ఈ మధ్య ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ పోరు చిరకాల ప్రత్యర్థితోనే మొదలయ్యేది. 2015 వన్డే ప్రపంచకప్, 2017 చాంపియన్స్‌ ట్రోఫీల్లో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌తోనే టీమిండియా మెగా ఈవెంట్‌లకు శ్రీకారం చుట్టింది. అయితే ఈసారి ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో కాకుండా 1992 ప్రపంచకప్‌ జరిగినట్లు రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అంటే పాల్గొనే పది జట్లు తమ ప్రత్యర్థులను ఒక్కో మ్యాచ్‌లో ఢీకొనాల్సిందే. లీగ్‌ దశ ముగిశాక మొదట నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయి.

అందుకే ఇంగ్లండ్, వేల్స్‌లో జరిగే ఈ ప్రపంచకప్‌ మే 30 నుంచి జూలై 14 వరకు సుదీర్ఘంగా 46 రోజుల పాటు జరుగనుంది. షెడ్యూల్‌ మార్పుపై సీనియర్‌ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ ‘వచ్చే ఐపీఎల్‌ మార్చి 29 నుంచి మే 19 వరకు నిర్వహిస్తున్నాం. కానీ 15 రోజుల వ్యత్యాసం కావాలంటే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జూన్‌ 2న మ్యాచ్‌ ఆడలేమని చెప్పాం. దీంతో మంగళవారం జరిగిన ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల మీటింగ్‌లో దీనిపై తుదినిర్ణయం తీసుకున్నారు’ అని చెప్పారు.   

మరిన్ని వార్తలు