టీమిండియా రెండోసారి..

10 Dec, 2018 15:50 IST|Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఎప్పుడో దశాబ్దం క్రితం పెర్త్‌లో చివరిసారి టెస్టు మ్యాచ్‌ గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఇంతకాలానికి ఆ గడ్డపై విజయాన్ని నమోదు చేసింది.  అదే సమయంలో ఆసీస్‌ పర్యటనలో భాగంగా సిరీస్‌ ఆరంభపు టెస్టులో భారత్‌ తొలిసారి విజయాన్నిసాధించింది.  ఇదిలా ఉంచితే, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఆసియా వెలుపల మూడో టెస్టు మ్యాచ్‌ను గెలిచింది భారత్‌ క్రికెట్‌ జట్టు. అంతకుముందు 1968లో తొలిసారి న్యూజిలాండ్‌లో మూడు టెస్టులు గెలిచిన భారత్‌.. 50 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు విజయాలను అందుకుంది.

ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జోహెనెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. ఆగస్టులో ఇంగ్లండ్‌తో ట‍్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇప్పుడు ఆసీస్‌పై గెలిచి మరొక విదేశీ గెలుపును నమోదు చేసింది. అయితే భారత్‌ గెలిచిన ఈ మూడు మ్యాచ్‌ల్లో చతేశ్వర పుజారా కనీసం ఒక ఇన్నింగ్స్‌లోనైనా యాభై, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడిగా పుజారా నిలిచాడు. సఫారీలతో జోహెనెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు సాధించిన పుజారా.. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. తాజాగా ఆసీస్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులు సాధించాడు.

రెండో ఆసియా జట్టుగా..

ఆసీస్‌ పర్యటనలో భాగంగా సిరీస్‌ ఆరంభపు మ్యాచ్‌లో గెలిచిన రెండో ఆసియా జట్టుగా భారత్‌ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్‌ మాత‍్రమే ఆ ఘనతను సాధించింది. 1978-79 సీజన్‌లో పాకిస్తాన్‌ ఆరంభపు మ్యాచ్‌లో గెలవగా, ఇప్పుడు ఆసీస్‌లో తొలి టెస్టును గెలిచి భారత్‌ శుభారంభం చేసింది.

మరిన్ని వార్తలు