-

అదిరే ఆరంభం

2 Feb, 2018 01:05 IST|Sakshi
మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కోహ్లి 

తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం

6 వికెట్లతో దక్షిణాఫ్రికా చిత్తు

కోహ్లి సెంచరీ, రాణించిన రహానే

డు ప్లెసిస్‌ శతకం వృథా

రెండో వన్డే ఆదివారం  

ఎక్కడ లక్ష్య ఛేదన ఉంటుందో అక్కడ విరాట్‌ కోహ్లి ఉంటాడు. ఫార్మాట్‌ మారినా, వేదిక మారినా వేటలో అతని ఆట మారలేదు. శతకాల జాబితాలో మరో అంకె కొత్తగా వచ్చి చేరిందే తప్ప తేడా ఏమీ లేదు. అతనికి తోడుగా అజింక్య రహానే కూడా జత కలిశాడు. అలవోకగా, ఆడుతూ పాడుతూ, ఎక్కడా ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా ముందుకు సాగిన ఈ ద్వయం దక్షిణాఫ్రికాను ఓ ఆటాడుకుంది. ఫలితమే భారత్‌కు అపురూప విజయం. ఆరు వన్డేల సిరీస్‌లో శుభారంభం.  ముందుగా భారత స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌ దెబ్బకు పరుగులు తీసేందుకు తీవ్రంగా శ్రమించిన దక్షిణాఫ్రికా జట్టు... కెప్టెన్‌ డు ప్లెసిస్‌ సెంచరీ ఇన్నింగ్స్‌తో కోలుకుంది. కానీ ఆ జట్టు విధించిన లక్ష్యం భారత్‌ ముందు చిన్నదిగా మారిపోయింది. ఓపెనర్లు త్వరగానే వెనుదిరిగినా కోహ్లి, రహానే 189 పరుగుల భారీ భాగస్వామ్యం భారత్‌ను ముందంజలో నిలిపింది. చివరి టెస్టులో విజయం తర్వాత డర్బన్‌ వేదికపై తొలి గెలుపుతో టీమిండియా వన్డేల్లోనూ సఫారీలకు సవాల్‌ విసిరింది.   

డర్బన్‌: వన్డేల్లో భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో సునాయాస విజయంతో శుభారంభం చేసింది. గురువారం ఇక్కడ కింగ్స్‌మీడ్‌ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (112 బంతుల్లో 120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. కుల్దీప్‌ 3, చహల్‌ 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరు 20 ఓవర్లలో కేవలం 79 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయడం సఫారీల పతనాన్ని శాసించింది. అనంతరం భారత్‌ 45.3 ఓవర్లలో 4 వికెట్లకు 270 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్‌  కోహ్లి (119 బంతుల్లో 112; 10 ఫోర్లు) వన్డేల్లో 33వ శతకం సాధించగా... అజింక్య రహానే (86 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్‌ ఆడి తన ఆటపై ఉన్న అనుమానాలను తొలగించాడు. ప్రస్తుతం సిరీస్‌లో భారత్‌ 1–0తో ముందంజలో నిలవగా... ఆదివారం సెంచూరియన్‌లో రెండో వన్డే జరుగుతుంది. ఈ గెలుపుతో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా వరుస 17 విజయాలకు భారత్‌ బ్రేక్‌ వేసింది.  
 
కీలక భాగస్వామ్యాలు... 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆశించిన ఆరంభం లభించలేదు. బుమ్రా వేసిన చక్కటి బంతికి ఆమ్లా (16) వికెట్ల ముందు దొరికిపోయాడు. వచ్చీ రాగానే భువనేశ్వర్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి డు ప్లెసిస్‌ ధాటిని ప్రదర్శించగా... పవర్‌ప్లే ముగిసేసరికి దక్షిణాఫ్రికా 49 పరుగులు చేసింది. ఆ తర్వాత పాండ్యా ఓవర్లోనూ మూడు ఫోర్లతో దక్షిణాఫ్రికా 18 పరుగులు రాబట్టింది. అయితే మరుసటి ఓవర్లో డి కాక్‌ (49 బంతుల్లో 34; 4 ఫోర్లు)ను ఎల్బీగా అవుట్‌ చేసి చహల్‌ మరో వికెట్‌ అందించాడు. ఈ దశలో లెగ్‌స్పిన్‌ ద్వయం చహల్, కుల్దీప్‌ సఫారీలను పూర్తిగా కట్టి పడేసింది. ఒక ఎండ్‌లో ప్లెసిస్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా, మరో ఎండ్‌లో తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు పడ్డాయి. మార్క్‌రమ్‌ (9) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. గుగ్లీతో డుమిని (12)ని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన కుల్దీప్‌... తన తర్వాతి ఓవర్లోనే మిల్లర్‌ (7)ను కూడా పెవిలియన్‌ పంపించాడు. కవర్స్‌లో కోహ్లి పట్టిన చక్కటి క్యాచ్‌ మిల్లర్‌ ఆట ముగించింది. 16–30 ఓవర్ల మధ్య కేవలం 2 ఫోర్లతో దక్షిణాఫ్రికా 55 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే భారత బౌలింగ్‌ ఎంత బాగా సాగిందో అర్థమవుతుంది. 134/5 స్కోరు నుంచి మోరిస్‌ (37; 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి కెప్టెన్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కుల్దీప్‌ ఓవర్లో భారీ సిక్సర్‌ బాదిన అతను మరో రెండు బంతులకే క్లీన్‌ బౌల్డ్‌ అయి వెనుదిరిగాడు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 101 బంతుల్లో డు ప్లెసిస్‌ కెరీర్‌లో 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో ప్లెసిస్, ఫెలుక్‌వాయో (27 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడి దక్షిణాఫ్రికాకు మెరుగైన స్కోరు అందించారు.  

ఒకరితో ఒకరు పోటీ పడి... 
భారత్‌ కూడా ఛేదనను దూకుడుగా ఆరంభించలేకపోయింది. తడబడుతూనే ఇన్నింగ్స్‌ కొనసాగించిన రోహిత్‌ శర్మ (20) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఔట్‌ కావడంతో జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. మరోవైపు ధావన్‌ (29 బంతుల్లో 35; 6 ఫోర్లు) స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపించాడు. చక్కటి షాట్లతో అతను చకచకా పరుగులు రాబట్టాడు. అయితే కోహ్లితో సమన్వయ లోపంతో ధావన్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ దశలో కోహ్లి, రహానే కీలక భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు మంచి సమన్వయంతో ఆడుతూ సఫారీ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 56 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరు మరింత దూకుడు పెంచారు. సఫారీల పేలవ బౌలింగ్‌ కూడా భారత్‌కు కలిసొచ్చింది. కొద్ది సేపటికి రహానే కూడా 60 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అతనికి ఇది వరుసగా ఐదో అర్ధసెంచరీ కావడం విశేషం. తర్వాత వీరిద్దరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించి దూసుకుపోయారు. 105 బంతుల్లో దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లి తొలి సెంచరీ పూర్తయింది. చివర్లో రహానే, కోహ్లి అవుటైనా అప్పటికే మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసింది.  

►15 విదేశీ గడ్డపై కోహ్లి చేసిన  సెంచరీల సంఖ్య

►1 డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌కిదే తొలి విజయం. గతంలో ఈ వేదికపై భారత్‌ ఏడు మ్యాచ్‌లు ఆడగా... ఆరింటిలో  ఓడిపోయింది. మరో మ్యాచ్‌ రద్దయింది.

మరిన్ని వార్తలు