భరత్‌ దిద్దిన బలగం 

18 Nov, 2019 03:21 IST|Sakshi

పేస్‌ విభాగంలో భారత్‌ అద్భుత పురోగతి

బలహీనతలను సరిదిద్దిన బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌

మ్యాచ్‌లో 20 వికెట్లు తీసే స్థాయికి చేరిన వైనం

మనది స్పిన్నిండియా! సిరీస్‌ల్లో నెట్టుకొచ్చినా... నెగ్గుకొచ్చినా... అది స్పిన్నర్ల వల్లే సాధ్యమయ్యేది. అందుకే స్పిన్‌ ఇండియాగా మారింది. కానీ ఇపుడు ఈ పరిస్థితి కూడా మారింది. స్పిన్నర్లకు  దీటుగా పేసర్లు దడదడలాడిస్తున్నారు. ఇటీవలే వారిని మించి కూడా రాణిస్తున్నారు. అంతలా ఈ పేస్‌ పదును పెరగడానికి బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఎంతో కృషి  చేశారు... చేస్తున్నారు కూడా!

సాక్షి క్రీడా విభాగం: సొంతగడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ గెలిచిందంటే అది స్పిన్నర్ల ఘనతే! కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడీ ఆనవాయితీ మారింది. పేస్‌ పదును తేలింది. ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్‌ చేసి... మ్యాచ్‌ల్ని, సిరీస్‌లనీ గెలవడంలో పేసర్ల పాత్ర పెరిగింది. ఉన్నపళంగా ఈ మార్పేమీ జరగలేదు. కొంతకాలంగా సానబెడితేనే పేస్‌ ఫలితాలు సాకారమవుతున్నాయి. ఈ ఫలితాలకు, గణనీయమైన మార్పులకు టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణే కారణం. ఆయన సీమర్లనే కాదు స్పిన్నర్లు చహల్, కుల్దీప్, అశ్విన్, జడేజాల లోపాలను కూడా సరిదిద్దారు. భారత ‘బ్యాటిం గ్‌’కు మేలురకమైన బౌలింగ్‌ బలగాన్ని జతచేశారు. దీంతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయాలు చేకూరుతున్నాయి. భరత్‌ బౌలర్లకు బంతులెక్కడ సంధించాలో చెప్పరు... ఆ బంతి ఎక్కడ పిచ్‌ కావాలనేది కచ్చితంగా చెబుతారు. అదే వాళ్లను అలా టర్న్‌ అయ్యేలా చేస్తుందనేది ఆయన నమ్మకం.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 1962లో పుట్టిన భరత్‌ అరుణ్‌ తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడారు. భారత్‌ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన ఆయన 1993లో రిటైర్మెంట్‌ ప్రకటించారు. తొమ్మిదేళ్ల తర్వాత 2002లో తమిళనాడు రంజీ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లపాటు భరత్‌ ఈ పదవిలో ఉన్నారు. రెండుసార్లు తమిళనాడును రంజీ ఫైనల్‌కు చేర్చారు. అనంతరం 2008లో జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన ఆయన 2012లో భారత అండర్‌– 19 జట్టు బౌలింగ్‌ కోచ్‌గా పని చేశారు. 2014లో ఐపీఎల్‌–7లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేసిన ఆయన అదే ఏడాది భారత సీనియర్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా నియమితులయ్యారు.

షమీ రనప్‌ మార్చి..
మొహమ్మద్‌ షమీ ప్రతిభఉన్న పేసరే కానీ... తర్వాత్తర్వాత పూర్తిగా టెస్టు బౌలర్‌గా ముద్రపడిపోయాడు. గాయాలతో సతమతమయ్యాడు. ఆటకు దూరమైన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అతనో ప్రధాన బౌలర్‌. కారణం భరత్‌ అరుణే! అతని సత్తా ఏంటో తెలిసిన కోచ్‌ ముందు షమీ రనప్‌ను గమనించాడు. పెద్దపెద్ద అంగలతో వేసే అడుగుల్ని మార్చాడు. వేగంగా పరిగెడితేనే సరిపోదని చెప్పాడు. బంతి సంధించేవేళ ఆ వేగాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడమే కీలకమన్నాడు. ఉదాహరణకు 200 కి.మీ. వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి తీరా బంతివేసే సమయానికి లయ కోల్పోతే లాభమేంటని సూచించాడు. ఎంత వేగంతో బ్యాలెన్స్‌ చేసుకుంటావో అంతే రనప్‌ అవసరమని చెప్పిన బౌలింగ్‌ కోచ్‌ మాటలు షమీని మార్చేశాయి. వేగం మారి బౌలింగ్‌ వైవిధ్యం పెరిగింది. కుదురుగా లైన్‌ అండ్‌ లెంత్‌కు కట్టుబడేలా చేసింది. అంతే కొన్ని రోజుల వ్యవధిలోనే అతనికి వన్డే జట్టులో పదిలమైన స్థానాన్ని కట్టబెట్టగా... ఇపుడు ఏకంగా పొట్టి ఫార్మాట్‌కు అక్కరకొచ్చే ఆటగాడ్ని చేసేసింది. పరిమిత ఓవర్ల ఆటకు దూరమైన ఆ బౌలర్‌ను వన్డే ప్రపంచకప్‌ ఆడే స్థితికి తీసుకొచ్చిన ఘనత అరుణ్‌దే.

బుమ్రా శైలిపై సంశయమున్నా.. 
బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ బౌలర్ల ప్రదర్శనకు వికెట్లే ప్రమాణంగా ఎప్పుడూ పరిగణించరు. భారత సంచలన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వచ్చీ రాగానే మంచి బౌలర్‌గా కితాబు అందుకున్నాడు. అతను తీసే వికెట్లతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తెగ సంబరపడింది... కానీ అతని భిన్నమైన బౌలింగ్‌ శైలిపై అందోళన పడింది మాత్రం అరుణే! ఇది అతని కెరీర్‌కు, ఫిట్‌నెస్‌కు సమస్యగా మారుతుందని తొలినాళ్లలోనే హెచ్చరించారు. శరీరంపై ఆ శైలి తాలూకు పడే అదనపు ఒత్తిడి వల్లే తాజాగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించడం విశేషమైతే ఫిజియోతో కలిసి అతని ఫిట్‌నెస్‌కు ఢోకా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కసరత్తు కూడా చేశారు అరుణ్‌. అయితే బుమ్రా తనకు ఆ బౌలింగ్‌ శైలే సౌకర్యవంతమని చెప్పడంతో కాదనలేకపోయారు. అలాగే ఇప్పుడు గాయం నుంచి కోలుకునేందుకు అన్ని రకాలుగా అతనికి సేవలందిస్తున్నారు. వికెట్లు తీస్తే సరిపోదని... నిలకడకూ ప్రాధాన్యమివ్వాలని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని పదేపదే హెచ్చరిస్తారు.

ఇషాంత్‌... స్వింగ్‌ సుల్తాన్‌ 
చాలా సార్లు ఇషాంత్‌ శర్మ వికెట్లు తీయడు. కానీ పొదుపుగా బౌలింగ్‌ చేస్తాడు. కారణం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఇషాంత్‌ను పెద్దగా పట్టించుకోకపోవడమే! దీన్ని బౌలింగ్‌ కోచ్‌ గమనించారు. అతని బౌలింగ్‌ కోణం (యాంగిల్‌), సంధించే ముందు మణికట్టు తీరు (రిస్ట్‌ పొజిషన్‌) మార్చుకుంటే సరిపోతుందని తగిన సలహాలిచ్చారు. అన్నట్లుగానే ఇషాంత్‌ తన బౌలింగ్‌ లోపాల్ని సరిదిద్దుకున్నాడు. అలా గాడినపడ్డ అతను వైవిధ్యమైన స్వింగ్‌ బౌలింగ్‌తో రాణిస్తున్నాడు. క్రికెటర్లెవరైనా ఒకసారి మంచిగా అనిపిస్తే అదే శైలిని, అదే దారిని కొనసాగిస్తారు. కానీ అది ఫలితాలను ఇవ్వకపోతే మాత్రం కొత్తదారుల్ని కనుగొనాలని చెబుతాడు అరుణ్‌. ఏదేమైనా ఇషాంత్‌ కొత్త యాంగిల్‌ను పరీక్షించడంతో పాటు ఉన్న లోపాల్ని సరిదిద్దుకోవడంతో మంచి స్వింగ్‌ బౌలర్‌గా మారాడు.

ఉమేశ్‌ పేస్‌కు పదును... 
ఉమేశ్‌ సొంతగడ్డపై అద్భుతంగా రాణిస్తాడు. కానీ విదేశాల్లో ఆ మేరకు రాణించలేకపోవడానికి కారణం తగినన్ని అవకాశాలు రాలేకపోవడమేనని భరత్‌ అరుణ్‌ విశ్లేషించారు. విదేశీ పిచ్‌లపై అనుభవం లేకే ఉమేశ్‌ వెనుకబడ్డాడు కానీ ప్రతిభ లేక కాదు అనేది ఆయన అభిప్రాయం. అతని ప్రదర్శనకు మెరుగులు దిద్దేందుకు అరుణ్‌ బాగా శ్రమించారు. రనప్‌పై ఎప్పటికప్పుడు  సూచనలు ఇస్తూనే జట్టుకు అవసరమైనపుడల్లా అందుబాటులో ఉంచుతున్నారు. దక్షిణాఫ్రికాతో ముందుగా ప్రకటించిన టీమిండియాలో ఉమేశ్‌ లేడు. కానీ బుమ్రా గాయంతో అతనికి అవకాశం వచ్చింది. స్వదేశీ పిచ్‌లపై అతనికి సరైన అవగాహన ఉంది. అప్పుడప్పుడు నిలకడ లోపించినా తుది ఎలెవన్‌ జట్టులో ఆడే సత్తా అతనికి ఉందని, ముగ్గురికి మించి పేసర్ల అవసరం లేకే అతను తుది జట్టుకు దూరమవుతున్నాడనేది కోచ్‌ అభిప్రాయం.

మరిన్ని వార్తలు