ఆ సంగతి ఆటగాళ్లకు బాగా తెలుసు 

21 Mar, 2019 00:06 IST|Sakshi

వర్క్‌లోడ్, ఫిట్‌నెస్‌పై ద్రవిడ్‌ వ్యాఖ్య

ముంబై: వరుస టోర్నీలతో వచ్చే పనిభారం (వర్క్‌లోడ్‌), ఫిట్‌నెస్‌ సమస్యలపై ఆటగాళ్లకు అవగాహన ఉందని... వాటిని సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యంతోనే క్రికెటర్లు ఉన్నారని భారత మాజీ కెప్టెన్, యువ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్‌ మంజ్రేకర్, రఘునాథన్‌ రంగస్వామి, రౌనక్‌ కపూర్, సంబిత్‌లతో ద్రవిడ్‌ తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. ‘తమ పనిభారం గురించి ఆటగాళ్లకు బాగా తెలుసు. ఎప్పుడు ఎలా ఆడాలో, ఏ మేరకు విశ్రాంతి కావాలో, ఎలా ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలో క్రికెటర్లకు గుర్తుంది. అందరి శరీరతత్వాలు ఒకేలా ఉండవు కాబట్టి అందరిపై ఒకే విధమైన వర్క్‌లోడ్‌ ఉంటుందని అంచనా వేయలేం. ఓ ఇంటర్వ్యూలో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ తనకు ‘రెస్ట్‌’ కంటే క్రమం తప్పకుండా ఆడుతూ ఉంటేనే ఫిట్‌గా ఉంటానని చెప్పాడు.

కొందరు విశ్రాంతితో టచ్‌లోకి వస్తారు. ఇలా ఒక్కో ఆటగాడికి ఒక్కో విధమైన ఫిట్‌నెస్‌ పాలసీ ఉంటుంది.  ఒక దాన్ని తీసుకొని అందరికీ రుద్దలేం’ అని అన్నాడు. ఆసీస్‌తో ఎదురైన పరాజయం మన మంచికేనని చెప్పుకొచ్చాడు. ‘కొన్నాళ్లుగా భారత్‌ అద్భుతంగా రాణిస్తోంది. దీంతో వన్డే ప్రపంచకప్‌ సులభంగానే నెగ్గుకొస్తారనే అంచనాలుండేవి. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఎదురైన ఓటమి మన జట్టును జాగ్రత్తపరుస్తోంది. అయితే మెగాటోర్నీలో మనం ఫేవరెట్లమే. కానీ అందులో ఆట, పోటీ అంత సులభం మాత్రం కాదు’ అని ద్రవిడ్‌ విశ్లేషించాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో కీలక ఆటగాళ్లకు ఐపీఎల్‌లో విశ్రాంతి ఇవ్వాలని బోర్డు ఫ్రాంచైజీలపై ఒత్తిడి తేకపోవచ్చని మరో మాజీ క్రికెటర్‌ మంజ్రేకర్‌ అన్నాడు.  

మరిన్ని వార్తలు