భారత్‌కు మరో 3 పతకాలు

29 Mar, 2019 02:34 IST|Sakshi

ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ:  ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. తైపీలోని తావోయువాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం భారత్‌ ఖాతాలో 3 పతకాలు చేరాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్సడ్‌ టీమ్‌ (జూనియర్‌) విభాగంలో భారత షూటర్లే స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇందులో శ్రేయ అగర్వాల్‌ – యశ్‌వర్ధన్‌ జోడి మొదటి స్థానంలో నిలవగా (497.3 పాయింట్లు)... మేహులి ఘోష్‌ – కేవల్‌ ప్రజాపతికి రెండో స్థానం (496.9 పాయింట్లు) దక్కింది.

ఈ ఈవెంట్‌లో కొరియా కాంస్య పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ (సీనియర్‌) విభాగంలో భారత్‌కు వెండి పతకం దక్కింది. ఎలవెనీల్‌ వలరివన్‌ – రవి కుమార్‌ ద్వయం రెండో స్థానంలో (498.4 పాయింట్లు) నిలిచి రజతాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ పోరులో కొరియా (499.6)కు స్వర్ణం దక్కగా, తైపీ కాంస్యం గెలుచుకుంది. మరో భారత జోడి దీపక్‌ కుమార్‌ – అపూర్వి చండీలా నాలుగో స్థానంలో నిలిచింది. పోటీల్లో రెండో రోజు ముగిసే సరికి మొత్తం ఐదు పతకాలు సాధించిన భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు