స్పిన్నర్‌ కాలేదని ఎవర్ని నిందిస్తాం: ఇషాంత్‌

23 Jul, 2018 12:57 IST|Sakshi

లండన్‌: గత కొంతకాలంగా భారత క్రికెట్‌ జట్టులో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా బౌలింగ్‌ విభాగంలో టీమిండియాలో ఆరోగ్యకరమైప పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పేసర్‌ ఇషాంత్‌ శర్మ జట్టులో స్థానాన్ని పూర్తి స్థాయిలో నిలుపుకోలేకపోతున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌, బూమ్రా, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌ల వంటి సీనియర్‌ బౌలర్లతో పాటు శార్దూల్‌ ఠాకూర్‌, సిద్దార్థ్‌ కౌల్‌ తరహా బౌలర్లు సైతం తమకు వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంతో ఇషాంత్‌కు అడపా దడపా అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ క‍్రమంలోనే  తానొక స్పిన్నర్‌ అయి వుంటే బాగుండేదని ఇషాంత్‌ శర్మ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా త్వరలో టెస్టు సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో డైలీ టెలిగ్రాఫ్‌కు ఇషాంత్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

‘కపిల్‌ దేవ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, జహీర్‌ ఖాన్‌ వంటి దిగ్గజ బౌలర్లు తమ తమ కాలంలో బంతితో భారత్‌కు ఒక్కొక్కరుగా సుదీర్ఘ కాలం సేవలందించారు. దాంతో భారత్‌లో ఎక‍్కువగా ఫాస్ట్‌ బౌలర్లు తయారు కారనే అపవాదు ఉండేది. అది గతం.. ఇప్పుడు పరిస్థితి వేరు. ఏ పరిస్థితుల్లోనైనా టీమిండియా బౌలింగ్‌ విభాగానికి సేవలందించేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది పేసర్లు సిద్ధంగా ఉన్నారు. ఇది నిజంగా శుభ పరిమాణం. ఇంగ్లండ్‌, ఆసీస్‌ పర్యటనల్లో గెలిచే బలం మాలో ఉంది. ఆ రెండు జట్ల అటాకింగ్‌ బౌలింగ్‌ ఎలా ఉందో అదే తరహా బౌలింగ్‌ కూడా మా సొంతం. దాంతో ఆయా జట‍్లపై టెస్టు సిరీస్‌ గెలుస్తామని ధీమాగా చెబుతున్నా’ అని ఇషాంత్‌ పేర్కొన్నాడు.

మరొకవైపు తాను పేస్‌ బౌలింగ్‌ చాయిస్‌ను ఎంచుకోవడానికి తానే కారణమన్నాడు. ఇక్కడ స్పిన్‌ బౌలింగ్‌ ఆప్షన్‌ని  తానెందుకు ఎంచుకోలేదో అనే దానిపై ఎవర్నీ నిందించాల్సిన పని లేదంటూ ఇషాంత్‌ జోక్‌ చేశాడు.

మరిన్ని వార్తలు