టోక్యో పిలుపు కోసం...

1 Nov, 2019 02:43 IST|Sakshi

భారత హాకీ జట్ల సమరం

రష్యాతో నేడు పురుషుల పోరు

అమెరికాతో మహిళల మ్యాచ్‌

భువనేశ్వర్‌: భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో వెళ్లే దారిలో పడ్డాయి. ఒలింపిక్స్‌ బెర్తులే లక్ష్యంగా ఇరు జట్లు పోటీలకు సిద్ధమయ్యాయి. ఎఫ్‌ఐహెచ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో శుక్రవారం పురుషుల జట్టుకు తమకంటే దిగువ ర్యాంకులో ఉన్న రష్యా ఎదురవగా... మహిళల జట్టుకు మాత్రం అమెరికా రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. ఒలింపిక్స్‌ పయనంలో భారత జట్లు  కేవలం రెండే విజయాల దూరంలో ఉన్నాయి. ఐదో ర్యాంక్‌లో ఉన్న భారత పురుషుల జట్టు 22వ ర్యాంకర్‌ రష్యాపై గెలవడం ఏమంత కష్టం కాకపోవచ్చు. కానీ భారత కోచ్‌ గ్రాహం రీడ్‌ మాత్రం ప్రత్యర్థి అంత సులువని తాము అంచనా వేయబోమని చెప్పారు. ‘మనది కాని రోజంటూ ఉంటే ఒలింపిక్స్‌ కలలు నీరుగారతాయని మాకు తెలుసు.

అందుకే నిర్లక్ష్యానికి, అలసత్వానికి ఏమాత్రం తావివ్వం. ఈ రెండు మ్యాచ్‌లు మాకు కీలకం’ అని అన్నాడు. రీడ్‌ కోచింగ్‌లో భారత రక్షణ శ్రేణి మెరుగైంది. గత 12 నెలల కాలంలో సురేందర్‌ కుమార్, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌లతో భారత డిఫెన్స్‌ పటిష్టమైంది. డ్రాగ్‌ఫ్లికర్లు రూపిందర్‌ పాల్‌ సింగ్, బీరేంద్ర లక్రాలు ఫామ్‌లో ఉన్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకెళుతున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో కెప్టెన్‌ మన్‌ప్రీత్, హార్దిక్‌ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్‌సాగర్‌ ప్రసాద్‌లు ఆశించిన స్థాయిలో రాణిస్తే రష్యాపై భారత్‌ సులభంగానే గోల్స్‌ సాధిస్తుంది. అలాగే అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ రష్యా దాడుల్ని సమర్థంగా నిరోధించగలడు.

అమెరికాతో ఎలాగబ్బా!
పురుషుల జట్టుకైతే సులువైన ప్రత్యర్థే! కానీ మహిళల జట్టుకే మింగుడుపడని ప్రత్యర్థి అమెరికా ఎదురైంది. ప్రపంచ 13వ ర్యాంకర్‌ అమెరికాతో భారత్‌కు 4–22తో పేలవమైన రికార్డు ఉంది. 22 సార్లు ప్రత్యర్థి చేతిలో ఓడిన మహిళల జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి. కెప్టెన్‌ రాణి రాంపాల్, డ్రాగ్‌ఫ్లికర్‌ గుర్జీత్‌ కౌర్, యువ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ లాల్‌రెమ్‌సియామి, గోల్‌కీపర్‌ సవితలపై జట్టు ఆశలు పెట్టుకుంది. కోచ్‌ జోయెర్డ్‌ మరీనే మాట్లాడుతూ అమెరికాపై భారత్‌ గెలుస్తుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఈ మ్యాచ్‌ల కోసమే గత ఏడాది కాలంగా నిరీక్షిస్తున్నామని, గెలిచే సత్తా అమ్మాయిల్లో ఉందని చెప్పారు. కెప్టెన్‌ రాణి రాంపాల్‌ మాట్లాడుతూ ‘ఆసియా గేమ్స్‌తోనే టోక్యో బెర్తు సాధించాలనుకున్నాం. దురదృష్టవశాత్తు అనుకున్న ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఒలింపిక్స్‌ బెర్తు సాధించే తీరతాం’ అని చెప్పింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా