ఆ నిర్ణయమే కోహ్లిసేన కొంపముంచిందా?

12 Aug, 2018 12:47 IST|Sakshi
టీమిండియా ఆటగాళ్లు

లండన్‌: లార్డ్స్‌ టెస్టులో టీమిండియా నిండా కష్టాల్లో మునిగింది. బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా బౌలర్స్‌ రాణిస్తారని భావిస్తే.. వారు నిరాశపరిచారు. తొలుత ప్రతాపం చూపిన భారత పేసర్లు... కీలక దశలో తేలిపోయారు. టెయిలెండర్ల ఆట కట్టిస్తారనుకున్న స్పిన్నర్లూ చేతులెత్తేశారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ (159 బంతుల్లో 120 బ్యాటింగ్‌; 18 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. అతడికి అండగా నిలుస్తూ జట్టును గట్టెక్కించిన వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టో (144 బంతుల్లో 93; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మూడో రోజు శనివారం ఆట నిలిపి వేసే సమయానికి ఇంగ్లండ్‌ 6 వికెట్లకు 357 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. వోక్స్‌తో పాటు స్యామ్‌ కరన్‌ (24 బంతుల్లో 22 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. నాలుగు వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్‌ 250 పరుగుల ఆధిక్యంలో ఉంది.(చదవండి : ..లాగేసుకున్నారు)

ఇక భారత్‌ను బ్యాట్స్‌మెన్‌ గట్టెక్కించాలి లేక ఆ వరణుడు కరుణించాలి ఇది కోహ్లి సేన తాజా పరిస్థితి. అయితే ఇలా జరగడానికి టీమిండియా తీసుకున్న నిర్ణయమే కారణమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో కుల్దీప్‌ను తుదిజట్టులోకి తీసుకోవడమే టీమిండియా కొంపముంచిందంటున్నారు. పిచ్‌ స్వింగ్‌కు అనుకూలిస్తుందని తెలిసినా.. వర్షంతో తొలి రోజు ఆట జరగకున్నా భారత తన వ్యూహాలను అమలు చేయకపోవడం నష్టం చేకూర్చింది. టాస్‌ ఓడటం.. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగిన విషయం తెలిసిందే. (చదవండి: బ్యాట్స్‌మెన్‌పైనే భారం)

ఇక ఈ పిచ్‌పై భారతే కాదు.. ఏ జట్టున్న ఇలానే జరిగేదని జేమ్స్‌ అండర్సన్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే పరిస్థితి ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. ఇక భారత పేసర్లు సైతం పిచ్‌ సహకారంతో తొలుత చెలరేగారు. 131 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి పట్టు సాధించే ప్రయత్నం చేశారు. కానీ బెయిర్‌ స్టో, వోక్స్‌లు 189 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ లాగేశారు. ఇక్కడ ఇషాంత్‌, షమీ, పాండ్యాలకు ఉమేశ్‌ తోడైతే ఫలితం వేరేలా ఉండేదని అర్థమవుతోంది. పిచ్‌పై పచ్చికతో బంతిపై ఏమాత్రం స్పిన్నర్లకు పట్టుదొరకడం లేదు. 26 ఓవర్ల వరకు బౌలింగ్‌ చేసిన స్పిన్నర్లు ఇద్దరు ఏమాత్రం ప్రభావం చూపకపోగా.. పరుగుల సమర్పించుకున్నారు. ఇక పిచ్‌ కూడా మెళ్లగా బ్యాటింగ్‌కు అనుకూలించడం భారత బౌలర్లకు సవాల్‌గా మారింది. 

చదవండి: ఏ జట్టుకైనా ఇదే పరిస్థితి: అండర్సన్‌

మరిన్ని వార్తలు