తుది జట్టులో గుర్ కీరత్!

12 Nov, 2015 17:35 IST|Sakshi
తుది జట్టులో గుర్ కీరత్!

బెంగళూరు:దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన టీమిండియా ఆల్ రౌండర్ గుర్ కీరత్ మన్ బెంగళూరులో  శనివారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు తుది జట్టులో ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ కు గుర్ కీరత్ టీమిండియా జట్టులో ఎంపికైనా తుది పదకొండు మంది ఆటగాళ్ల జాబితాలో  స్థానం దక్కలేదు. దీంతో గుర్ కీరత్ కు రెండో టెస్టులో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.

 

గత వారం రంజీ ట్రోఫీల్లో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో గుర్ కీరత్ తొమ్మిది వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో పాటు అక్టోబర్ లో రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ కూడా నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని  ఆకర్షించాడు. కాగా, టీమిండియా జట్టులో పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్ కు గుర్ కీరత్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.  కనీసం రెండో టెస్టులో అవకాశం ఇస్తే బావుంటుందని సెలెక్టర్ల భావనగా కనబడుతోంది.  ఒకవేళ గుర్ కీరత్ ను తుది జట్టులో అవకాశం కల్పిస్తే స్పిన్నర్ అమిత్ మిశ్రాను పక్కకు పెట్టే అవకాశం ఉంది.

ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఎంపికైన రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, స్టువర్ట్ బిన్నీలకు రంజీ ట్రోఫీల్లో ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వారు రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చినా రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రాక్టీస్ లో గాయపడ్డ దక్షిణాఫ్రికా పేసర్ వెర్నోర్ ఫిలిందర్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. వార్మప్ లో భాగంగా బెంగళూరులో ఫుట్ బాల్ ఆడుతూ ఎడమ కాలి చీలమండకు గాయం కావడంతో ఫిలిందర్ కు విశ్రాంతి నిచ్చారు. అతని స్థానంలో కేల్ అబాట్ కు స్థానం కల్పించనున్నారు.

మరిన్ని వార్తలు