యువ సత్తాకు పరీక్ష

15 Sep, 2017 00:58 IST|Sakshi
యువ సత్తాకు పరీక్ష

నేటి నుంచి కెనడాతో భారత్‌ డేవిస్‌ కప్‌ పోరు  

ఎడ్మాంటన్‌ (కెనడా): డేవిస్‌ కప్‌ టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత యువ జట్టుకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. నేటి నుంచి జరిగే వరల్డ్‌ గ్రూప్‌ ప్లే–ఆఫ్‌ పోరులో భారత్‌... కెనడాతో తలపడనుంది. శుక్రవారం ఇక్కడి ఇండోర్‌ కోర్టుల్లో రెండు సింగిల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇరు జట్లలోనూ యువ ఆటగాళ్లే ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది. భారత ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌ రామనాథన్‌ ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు ప్రపంచ 51వ ర్యాంకర్‌ డెనిస్‌ షపొవలోవ్‌ కెనడా తరఫున కీలక ఆటగాడు. 18 ఏళ్ల షపొవలోవ్‌ ఇటీవల మాంట్రియల్‌ మాస్టర్స్‌ టోర్నీలో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ను కంగుతినిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. డెల్‌ పొట్రో, జో విల్‌ఫ్రెడ్‌ సోంగాలను కూడా ఓడించి తన విజయాలు గాలివాటం కాదని నిరూపించాడు.

ఇటీవలే జరిగిన యూఎస్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరాడు. కెనడా తరఫున మరో సింగిల్స్‌ ఆటగాడు వాసెక్‌ పొస్పిసిల్‌కు గతంలో యూకీపై గెలిచిన అనుభవముంది. ఇక భారత్‌ ఆశలన్నీ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌లపైనే ఉన్నాయి. నిలకడగా రాణిస్తున్న యూకీ ఇటీవల గేల్‌ మోన్‌ఫిల్స్‌పై, రామ్‌కుమార్‌... డొమినిక్‌ థీమ్‌పై గెలిచి సత్తా చాటుకున్నారు. ఈ నేపథ్యంలో షపొవలోవ్‌ను ఓడించే సత్తా తమకుందని ఇటీవలి ఫలితాలతో నిరూపిస్తున్నారు. రామ్‌కుమార్‌ కంటే యూకీ బాంబ్రీ పరిణతి చెందిన ఆటగాడు. కోర్టులో చురుగ్గా స్పందిస్తాడు. ఆటపై పూర్తి నియంత్రణ సాధించగలడు.

సర్వీస్‌లో చాలా మెరుగైన రామ్‌కుమార్‌ మ్యాచ్‌ సాగే కొద్దీ ఆధిపత్యం చలాయించగల సత్తా  ఉన్న ఆటగాడు. అతని ఫిట్‌నెస్‌ కూడా భారత్‌కు కలిసొస్తుంది. శుక్రవారం జరిగే సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో వీళ్లిద్దరిలో ఒకరైనా గెలిస్తే... డబుల్స్‌లో రోహన్‌ బోపన్న–సాకేత్‌ మైనేని జోడి చెలరేగేందుకు సిద్ధంగా ఉంది. ఈ జోడీకి డానియెల్‌ నెస్టొర్‌–బ్రాడ్‌లీ షుర్‌ జంట ఎదురయ్యే అవకాశముంది. సింగిల్స్‌లో కెనడా మేటి ఆటగాడు ప్రపంచ 11వ ర్యాంకర్‌ మిలోస్‌ రావోనిక్‌ గాయంతో దూరమవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. దీంతో కెనడాపై గెలిచి మళ్లీ వరల్డ్‌ గ్రూప్‌లోకి ప్రవేశించే అవకాశముంది. గత మూడేళ్లుగా భారత్‌ ప్లే–ఆఫ్‌ దశను దాటలేకపోతోంది. 2014లో సెర్బియా చేతిలో, 2015లో చెక్‌ రిపబ్లిక్‌ చేతిలో, గతేడాది స్పెయిన్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది.

మరిన్ని వార్తలు