వరల్డ్‌ కప్పే చివరిది.. ధోనీ కూడా రిటైర్‌!

3 Jul, 2019 15:05 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: వరల్డ్‌ కప్‌లో తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, రాయుడి దారిలోనే భారత క్రికెట్‌ లెజెండ్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నాడు. వరల్డ్‌ కప్‌ తర్వాత ధోనీ రిటైర్‌ అవుతాడని అందరూ ఊహించని విషయమే. ఇందులో రహస్యమేమీ లేదు. కానీ, వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకబోతున్నట్టు తెలుస్తోంది. అంటే, వరల్డ్‌ కప్‌ తర్వాత ధోనీ ఇక టీమిండియా నీలిరంగు జెర్సీలో కనిపించకపోవచ్చు. 

ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఈ నెల 14న లార్డ్స్‌ మైదానంలో జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌ ధోనీకి చివరి మ్యాచ్‌ కానుంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం​ సాధిస్తే.. ధోనీకి ఇంతకంటే ఘనమైన వీడ్కోలు మరొకటి ఉండబోదు. ఒకవేళ అన్ని కలిసొస్తే.. వరల్డ్‌ కప్‌ విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ధోనీ వైదొలగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన రిటైర్మెంట్‌ గురించి బీసీసీఐ అధికారులకు ధోనీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. 

‘ధోనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరూ చెప్పలేం. కానీ, వరల్డ్‌ కప్‌ తర్వాత ఆయన భారత జట్టులో కొనసాగే అవకాశం లేదు. అనూహ్యంగా మూడు ఫార్మెట్లలోనూ కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఊహించలేం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత సెలక్షన్‌ కమిటీ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగుస్తుంది. ఆ స్థానంలో వచ్చే కొత్త సెలక్షన్‌ కమిటీ దృష్టి అంతా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ మీద ఉంటుంది. కొత్త సెలక్షన్‌ కమిటీ జట్టులో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చు. ఈ మార్పుల్లో యువ క్రీడాకారులకు పెద్ద పీట ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 

ఇక, టీమిండియా వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించిన ప్రస్తుత తరుణంలో ధోనీ రిటైర్మెంట్‌ వంటి సున్నితమైన విషయాలపై స్పందించడానికి బీసీసీఐ ముందుకురావడం లేదు. ఈ వరల్డ్‌ కప్‌లో ధోనీ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి.. 93కుపైగా స్ట్రైక్‌ రేట్‌తో 223 పరుగులు చేశాడు. అయితే, కీలక సమయాల్లో భారీ షాట్లు ఆడకపోవడం, స్లో బ్యాటింగ్‌ చేస్తుండటంతో ధోనీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్‌ ఫినిషర్‌గా గొప్ప పేరున్న ధోనీ.. ఇలా నెమ్మదించడంతో ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి. ధాటిగా ఆడాలన్న కసి ధోనీలో లేదని, వయస్సు మీద పడిందని అంటున్నారు. ధోనీని విమర్శించి.. తప్పుబట్టిన వారిలో సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ టెండూల్కర్‌ వంటి భారత మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు.

ఈ విమర్శలు ఎలా ఉన్నా.. ధోనీని తక్కువ చేసి చూసేందుకు బీసీసీఐ ఇష్టపడటం లేదు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ.. ‘బీ లవ్‌డ్‌ కెప్టెన్‌’గా క్రికెట్‌ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఐసీసీ టోర్నమెంట్లన్నింటినీ గెలుపొందిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోనీ ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌ క్రికెట్‌కు ధోనీ అందించిన విజయాలు, జరిపిన కృషి ఎనలేనిది. భారత క్రికెటర్లందరూ ధోనీని పొగిడినవారే. ఇక, ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో ధోనీ విఫలమైనా.. జట్టు సెమీస్‌కు చేరడం.. అతనికి రక్షణగా నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి.. ధోనీ ఒక నిర్ణయం అనివార్యంగా తీసుకోవాల్సిందేనని ఓ మాజీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డారు. 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు