క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి

16 Nov, 2014 00:22 IST|Sakshi
క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి

రాంచీ: ఓవైపు అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిపోతున్న భారత్ జట్టు...మరోవైపు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్న శ్రీలంక టీమ్... సిరీస్‌లో ఆఖరిదైన ఐదో వన్డే కోసం సిద్ధమయ్యాయి. ఆదివారం జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనేది భారత లక్ష్యం. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనేది లంక ఆరాటం. ఐదు వన్డేల సిరీస్‌లో శ్రీలంక ఎప్పుడూ 0-5తో ఓడిపోలేదు. ఐదో వన్డేలోనూ ఓడితే మ్యాథ్యూస్ సేన ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వస్తుంది.

 వరుస విజయాలతో ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో రైనాకు విశ్రాంతినిచ్చింది. దీంతో మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి.  కోచ్ ఫ్లెచర్ పర్యవేక్షణలో జాదవ్ శనివారం ఎక్కువసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. బ్యాట్స్‌మెన్ అంతా ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. బౌలింగ్ విషయానికొస్తే ఉమేశ్ నెట్స్‌లో పాల్గొనకుండా వెన్ను కండరాలను పటిష్టం చేసుకునే పనిలో పడ్డాడు.

దీంతో వినయ్ కుమార్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం రావొచ్చు. బిన్నీ, కులకర్ణీ, అక్షర్ పటేల్‌లు తమ పాత్రను సమర్థంగా పోషిస్తుండటం భారత్‌కు అనుకూలాంశం. మరోవైపు లంక జట్టు బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. మలింగ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగో వన్డేలో ఆడిన మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ పెద్దగా ప్రభావం చూపకపోవడం, మిగతా బౌలర్లు ఆశించిన మేరకు రాణించకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీంతో పాటు ఫీల్డింగ్‌లోనూ లంకేయులు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు.

 తగ్గిన సందడి
 లోకల్ హీరో ధోని లేకపోవడంతో ఈ మ్యాచ్‌పై రాంచీ అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. టిక్కెట్ల అమ్మకం ఆశించిన స్థాయిలో లేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. 20 వేల మంది మాత్రమే హాజరయ్యే అవకాశాలున్నాయి. జార్ఖండ్‌లో ఈనెల 25 నుంచి ఎన్నికలు జరుగుతుండటం కూడా ఓ కారణమని అసోసియేషన్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు హాజరుకానున్న ధోని... జట్టు సహచరులకు తన బంగ్లా హర్మూలో విందు ఇవ్వనున్నట్లు సమాచారం.

 జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, రోహిత్, రాయుడు, జాదవ్, ఉతప్ప, బిన్నీ, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, ఉమేశ్ / వినయ్, కులకర్ణి.
 శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కె.పెరీరా, దిల్షాన్, చండిమల్, జయవర్ధనే, తిరిమన్నే, టి.పెరీరా, ప్రసన్న, కులశేఖర, మెండిస్, ఎరంగా,
 పిచ్, వాతావారణం
 వికెట్‌పై కాస్త బౌన్స్ ఉంటుంది. మొదట పేసర్లకు తర్వాత స్పిన్నర్లకు అనుకూలం. మంచు ప్రభావం ఉంది. వర్షం పడే అవకాశాల్లేవు.
 
 మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1, డీడీలో  ప్రత్యక్ష ప్రసారం

>
మరిన్ని వార్తలు