అడిలైడ్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. చిక్కుల్లో భారత్‌

6 Dec, 2018 10:20 IST|Sakshi

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాలో ప్రారంభమైన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తడబడింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25)లు పెవిలియన్‌కు చేరారు. 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో రోహిత్‌ శర్మ-రిషబ్‌ పంత్‌లు కాసేపు మరమ్మత్తులు చేశారు. ఆపై వీరిద్దరూ సైతం వెనుదిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లలో హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా,  స్టార్క్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.టీ విరామానికి భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులతో ఉంది. పుజారా(46) క్రీజ్‌లో ఉన్నాడు.

ఆసీ​స్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. కంగారూ బౌలర్లు పదునైన బంతులు సంధించడంతో టీమిండియా త్వరగా వికెట్లు నష్టపోయింది. 15 పరుగుల​కే ఓపెనర్లు రాహుల్‌, విజయ్‌ పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ కోహ్లి వెంటనే అవుటయ్యాడు. రహానే కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ పుజారా, రోహిత్‌తో కలిసి కాసేపు పోరాడాడు. ఈ జోడిని లియాన్‌ విడదీశాడు. కుదురుకుంటున్న రోహిత్‌ను పెవిలియన్‌ను పంపాడు. ఆపై కాసేపటికి రిషబ్‌ పంత్‌ను కూడా లియాన్‌ ఔట్‌ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు.

>
మరిన్ని వార్తలు