భారత్‌ గోల్స్‌ గర్జన

30 Mar, 2019 01:38 IST|Sakshi

10–0తో పోలాండ్‌పై జయభేరి

నేడు కొరియాతో అమీతుమీ

అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీ  

ఇపో (మలేసియా): అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ గోల్స్‌ సునామీతో పోలాండ్‌ను చిత్తు చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 10–0 గోల్స్‌తో పోలాండ్‌పై జయభేరి మోగించింది. స్ట్రయికర్‌ మన్‌దీప్‌ సింగ్‌ తన జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. అతను (50వ, 51వ ని.లో) రెండు గోల్స్‌ చేశాడు. డ్రాగ్‌ఫ్లికర్‌ వరుణ్‌ కుమార్‌ (18వ, 25వ ని.లో) కూడా రెండు గోల్స్‌ సాధించగా, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (1వ ని.లో), సుమిత్‌ కుమార్‌ (7వ ని.లో), సురేందర్‌ కుమార్‌ (19వ ని.లో) సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (29వ ని.లో), నీలకంఠ శర్మ (36వ ని.లో), అమిత్‌ రోహిత్‌దాస్‌ (55వ ని.లో) తలా ఒక గోల్‌ చేశారు. ఈ మ్యాచ్‌లోనే కాదు... ఈ టోర్నీలోనే భారత్‌ అద్భుతంగా రాణించింది.

ఐదుసార్లు అజ్లాన్‌ షా చాంపియన్‌ అయిన భారత్‌ ఆరంభం నుంచే పోలాండ్‌పై గర్జించింది. తొలి క్వార్టర్‌ను 2–0తో ముగించిన భారత్‌ రెండో క్వార్టర్‌లో స్కోరును 4–0తో రెట్టింపు చేసుకుంది. చివరి క్వార్టర్‌లో మరో మూడు గోల్స్‌తో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ టోర్నీలో భారత్‌ అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌ ఫలితం కంటే ముందే ఫైనల్‌ చేరిన భారత్‌ నేడు జరిగే టైటిల్‌ పోరులో కొరియాతో అమీతుమీ తేల్చుకుంటుంది.    
 

మరిన్ని వార్తలు