‘మ్యాక్స్’ ముంచేశాడు

18 Jan, 2016 00:27 IST|Sakshi
‘మ్యాక్స్’ ముంచేశాడు

0-3తో సిరీస్ కోల్పోయిన భారత్
మూడో వన్డేలో  3 వికెట్లతో ఆసీస్ విజయం
చెలరేగిన మ్యాక్స్‌వెల్
కోహ్లి సెంచరీ వృథా
నాలుగో వన్డే బుధవారం

 
 మూడొందలకు పైగా పరుగులు చేసిన చోట కూడా ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా అంతకంటే తక్కువ స్కోరుకే విజయంపై ఆశలు పెంచుకుంది. ఛేదనలో 30 ఓవర్లలోపే ప్రత్యర్థి జట్టులోని నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసి పట్టు బిగించింది.
 
 కానీ మనోళ్లు స్మిత్, బెయిలీ అంటూ వ్యూహాలు పన్నిన చోట ఈసారి మ్యాక్స్‌వెల్ అడ్డుపడ్డాడు. కీలక దశలో కొరకరాని కొయ్యగా మారి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఇప్పుడు నా వంతు అన్నట్లుగా కోహ్లి తన శతకంతో భారత్‌ను నడిపిస్తే... మ్యాక్స్‌వెల్ మెరుపుల ముందు దాని విలువ తగ్గిపోయింది.
 
 సెంచరీలు భారత్‌వయితే, విజయాలు ఆసీస్‌కు అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. బ్యాట్స్‌మెన్ నమ్మకం నిలబెట్టిన చోట బౌలర్లు మళ్లీ నిరాశపర్చడంతో వరుసగా మూడు పరాజయాలతో ధోని సేన సిరీస్ కోల్పోయింది. ఇక మిగిలింది పరువు కోసం పోరాటమే.
 
 మెల్‌బోర్న్: వేదిక మారినా, స్కోరు మారినా, మళ్లీ మన బ్యాట్స్‌మన్ సెంచరీ బాదినా... మ్యాచ్ ఫలితంలో మాత్రం మార్పు రాలేదు. మళ్లీ మూడొందలకు చేరువలో స్కోరు చేసినా ధోని సేన దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (117 బంతుల్లో 117; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్ (91 బంతుల్లో 68; 9 ఫోర్లు), రహానే (55 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హేస్టింగ్స్‌కు 4 వికెట్లు దక్కాయి.
 
 అనంతరం ఆస్ట్రేలియా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (83 బంతుల్లో 96; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన ఇన్నింగ్స్‌కు తోడు షాన్ మార్ష్ (73 బంతుల్లో 62; 6 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. భారత్ రెండు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పినా... మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్ మధ్య నెల కొన్న 81 పరుగుల భాగస్వామ్యం టీమిండియాకు విజయాన్ని దూరం చేసింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం కాన్‌బెర్రాలో జరుగుతుంది.
 
 విరాట్ కీలక ఇన్నింగ్స్...
 టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి కూడా ఛేదనపైనే ఆసక్తి చూపిం చి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. టీమిండియా ఆశ్చర్యకరమైన రెండు మార్పులు చేసింది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు గుర్‌కీరత్ సింగ్, రిషి ధావన్‌లకు తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వడంతో జట్టు ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగినట్లయింది. వరుసగా రెండు సెంచరీలతో ఊపు మీదున్న రోహిత్ (6) ఈ మ్యాచ్‌లో త్వరగానే వెనుదిరగడంతో భారం కోహ్లి, శిఖర్‌లపై పడింది. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ధావన్ నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్నాడు.
 
 కోహ్లి కూడా దూకుడుకు పోకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో వరుస బంతుల్లో ఇద్దరి అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. చివరకు హేస్టింగ్స్ బౌలింగ్‌లో శిఖర్ బౌల్డ్ కావడంతో 119 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన కోహ్లి 105 బంతుల్లో శతకం మార్క్‌ను చేరుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి కాగానే బౌండరీ వద్ద స్మిత్-మ్యాక్స్‌వెల్ కాంబినేషన్‌లో అద్భుత క్యాచ్‌కు రహానే అవుటయ్యాడు. కోహ్లి, రహానే మూడో వికెట్‌కు 109 పరుగులు జత చేశారు. ధోని (9 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్ చేసినా... భారత్ స్కోరు 300 లోపే ఆగిపోయింది.  
 
 చెలరేగిన మ్యాక్స్‌వెల్...
 ఓపెనర్లు షాన్ మార్ష్, ఫించ్ (21) 43 బంతుల్లోనే చకచకా 48 పరుగులు జత చేయడంతో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. 20 పరుగుల వద్ద ఫించ్ క్యాచ్‌ను గుర్‌కీరత్ వదిలేసినా అతను వెంటనే అవుట్ కావడంతో దాని ప్రభావం పడలేదు. అనంతరం స్మిత్ (45 బంతుల్లో 41; 5 ఫోర్లు), బెయిలీ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు) తమదైన శైలిలో ఆడుతూ ఎక్కడా రన్‌రేట్‌ను తగ్గనీయలేదు. అయితే జడేజా తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి ఆశలు రేపాడు. షాన్ మార్ష్‌ను ఇషాంత్ అవుట్ చేయడంతో ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు నుంచి శరణ్ ఓవర్లో రెండు ఫోర్లు బాది మ్యాక్స్‌వెల్ తన దూకుడు మొదలు పెట్టాడు. ఉమేశ్ చక్కటి ఫీల్డింగ్‌కు మిషెల్ మార్ష్ (17) రనౌట్ కాగా, వేడ్ (6) కూడా వెంటనే అవుటయ్యాడు.
 
 ఈ దశలో ఆస్ట్రేలియా విజయానికి మరో 81 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్లు ఒత్తిడిని కొనసాగించడంలో విఫలమయ్యారు. దాంతో స్వేచ్ఛగా, సమయస్ఫూర్తితో ఆడిన మ్యాక్స్‌వెల్ దూసుకుపోయాడు. ఉమేశ్ వేసిన 43వ ఓవర్లో అతను 15 పరుగులు రాబట్టాడు. ఉమేశ్ బౌలింగ్‌లోనే వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టి స్కోరు సమం చేసిన మ్యాక్స్‌వెల్ సెంచరీ కోసం భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కాగా.... ఫాల్క్‌నర్ సింగిల్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
 
 స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వేడ్ (బి) రిచర్డ్సన్ 6; శిఖర్ ధావన్ (బి) హేస్టింగ్స్ 68; కోహ్లి (సి) బెయిలీ (బి) హేస్టింగ్స్ 117; రహానే (సి) మ్యాక్స్‌వెల్ (బి) హేస్టింగ్స్ 50; ధోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) హేస్టింగ్స్ 23; గుర్‌కీరత్ (బి) ఫాల్క్‌నర్ 8; జడేజా (నాటౌట్) 6; రిషి ధావన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 295. వికెట్ల పతనం: 1-15; 2-134; 3-243; 4-265; 5-274; 6-288.
 
 బౌలింగ్: రిచర్డ్సన్ 10-0-48-1; హేస్టింగ్స్ 10-0-58-4; ఫాల్క్‌నర్ 10-0-63-1; బోలండ్ 9-0-63-0; మ్యాక్స్‌వెల్ 9-0-46-0; మిషెల్ మార్ష్ 2-0-12-0.
 
 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షాన్ మార్ష్ (సి) ధోని (బి) ఇషాంత్ 62; ఫించ్ (సి) ధోని (బి) ఉమేశ్ 21; స్మిత్ (సి) రహానే (బి) జడేజా 41; బెయిలీ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 23; మ్యాక్స్‌వెల్ (సి) శిఖర్ ధావన్ (బి) ఉమేశ్ 96; మిషెల్ మార్ష్ (రనౌట్) 17; వేడ్ (సి) శిఖర్‌ధావన్ (బి) ఇశాంత్ 6 ; ఫాల్క్‌నర్ (నాటౌట్) 21; హేస్టింగ్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.5 ఓవర్లలో 7 వికెట్లకు) 296.  వికెట్ల పతనం: 1-48; 2-112; 3-150; 4-167; 5-204; 6-215; 7-295.
 
 బౌలింగ్: ఉమేశ్ 9.5-0-68-2; శరణ్ 8-0-63-0; ఇషాంత్ 10-0-53-2; రిషి ధావన్ 6-0-33-0; గుర్‌కీరత్ 5-0-27-0; జడేజా 10-0-49-2.
 
కోహ్లి వన్డేల్లో 7 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయి దాటిన 8వ భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. తక్కువ ఇన్నింగ్స్‌లలో (161) ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా అతను డివిలియర్స్ (166) రికార్డును సవరించాడు.
 
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 17వ విజయం. దీంతో వెస్టిండీస్ (16 మ్యాచ్‌లు) రికార్డు కనుమరుగైంది.
 భారత జట్టుకు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను ధోని సొంతం చేసుకున్నాడు.
 
 కోహ్లి కెరీర్‌లో ఇది 24వ సెంచరీ. ఈ క్రమంలో సచిన్ (219 ఇన్నింగ్స్‌లు) కంటే చాలా వేగంగా ఇన్ని సెంచరీలు చేసిన రికార్డు విరాట్ (161 ఇన్నింగ్స్‌లు)కు దక్కింది.
 

మరిన్ని వార్తలు