ఏషియన్‌గేమ్స్‌ రజతం.. బంగారమైంది!

20 Jul, 2019 16:59 IST|Sakshi
ముహమ్మద్‌ అనస్‌, పూవమ్మ మచెట్టేరి, హిమదాస్‌, రాజీవ్‌

అదనంగా ఓ కాంస్య పతకం కూడా

జకార్త : ఏషియన్‌ గేమ్స్‌-2018లో మిక్స్‌డ్‌ 4x400m రిలే విభాగంలో తొలిసారి భారత ట్రాక్‌ జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ రజతం కాస్త ఇప్పుడు స్వర్ణమైంది. ముహమ్మద్‌ అనస్‌ యాహియా, పూవమ్మ మచెట్టేరి, హిమదాస్‌, రాజీవ్‌ అరోకియాలతో కూడిన భారత బృందం 3:15.71 సమయంలో లక్ష్యాన్ని చేరుకొని రెండో స్థానంలో నిలిచింది. దీంతో భారత్‌ ట్రాక్‌జట్టుకు రజతం వరించింది. తొలి స్థానంలో నిలిచిన బెహ్రెయిన్‌(3:11.89) జట్టుకు స్వర్ణం దక్కగా.. కజకిస్తన్‌(3:19.52)కు కాంస్యం లభించింది.

అయితే బెహ్రెయిన్‌ జట్టుకు చెందిన అథ్లెట్‌ కెమి అడెకోయ డోపింగ్‌టెస్ట్‌లో విఫలమవడంతో అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) నాలుగేళ్లు నిషేధం విధించింది. అంతేకాకుండా 2018 ఆగస్టు 24 నుంచి 2018 నవంబర్‌ 2018 మధ్య కెమి అడెకోయ సాధించిన విజయాలకు అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో ఏషియన్‌ గేమ్స్‌లో బెహ్రెయిన్‌ జట్టు గెలిచిన స్వర్ణం భారత్‌ వశమైంది. ఇక బెహ్రెయిన్‌ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే తమ అథ్లెట్లకు పరుగు ఆటంకం కలిగించారని భారత అధికారులు అప్పట్లో ఫిర్యాదు చేశారు. చివరకు ఆ స్వర్ణం భారత్‌ వశం కావడం గమనార్హం. కెమి అడెకోయ 400m రిలే విభాగంలో స్వర్ణం సాధించగా.. భారత అథ్లెట్‌ అను రాఘవన్‌ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఏఐయూ తాజా నిర్ణయంతో అనుకు కాంస్యం లభించింది.
చదవండి: టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా?

మరిన్ని వార్తలు