సెమీ ఫైనల్లో ధోని సేన

27 Mar, 2016 23:06 IST|Sakshi
సెమీ ఫైనల్లో ధోని సేన

మొహాలి: పొట్టి ఫార్మాట్ లో ఆస్ట్రేలియాపై మరోసారి టీమిండియాదే పైచేయి అయ్యింది. తమ బౌలింగ్, బ్యాటింగ్ లో బలం చూపించిన ధోని సేన ఆసీస్ ను మట్టికరిపించింది.  వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా గ్రూప్-2లో ఆదివారం ఆసీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచి సెమీ ఫైనల్ కు చేరింది.  కీలక వికెట్లను ఆదిలోనే చేజార్చుకున్న ధోని సేన కడవరకూ పోరాడి విజయ ఢంకాను మోగించింది.  తద్వారా ఆసీస్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించింది.  భారత విజయంలో విరాట్ కోహ్లి(82 నాటౌట్; 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ముఖ్య భూమిక పోషించాడు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి  160 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్లు అరోన్ ఫించ్(43; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు), ఉస్మాన్ ఖవాజా(26; 16 బంతుల్లో 6 ఫోర్లు) చెలరేగి ఆడటంతో ఆసీస్ నాల్గో ఓవర్ ముగిసే సరికి  వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. అయితే ఆసీస్ స్కోరు 54 పరుగుల వద్ద ఖవాజా తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.

 
ఆపై డేవిడ్ వార్నర్ (6) రెండో వికెట్ గా, కెప్టెన్ స్టీవ్ స్మిత్(2) మూడో వికెట్ గా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు పంపడంతో ధోని సేన శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.  ఆ తరుణంలో ఫించ్ కు మ్యాక్స్ వెల్ జతకలిశాడు. ఈ జోడి ఆసీస్ ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టి స్కోరు బోర్డును ముందుకు నడిపించే యత్నం చేసింది. అయితే జట్టు స్కోరు 100 పరుగుల వద్ద ఫించ్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ను చక్కబెట్టే బాధ్యతను షేన్ వాట్సన్ -మ్యాక్స్ వెల్ జోడి తీసుకుంది. ఈ క్రమంలోనే మాక్స్ వెల్ (31;28 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) , షేన్ వాట్సన్(18 నాటౌట్) మోస్తరుగా రాణించారు. ఇక  చివర్లో నేవిల్(10 నాటౌట్; 2 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, బూమ్రా, నెహ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది.

అనంతరం ఆసీస్ విసిరిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఆటగాళ్లలో  శిఖర్ ధావన్(13), రోహిత్ శర్మ(12), సురేష్ రైనా(10)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో విరాట్ కోహ్లి-యువరాజ్ సింగ్ ల జోడి ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టింది. అయితే జట్టు స్కోరు 94 పరుగుల వద్ద యువరాజ్ సింగ్(21)నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కాగా, విరాట్ మాత్ర్రం దూకుడును కొనసాగిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. ఇదే క్రమంలో విరాట్ హాఫ్ సెంచరీ మార్కును చేరగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(18 నాటౌట్; 10 బంతుల్లో  3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. దీంతో టీమిండియా ఇంకా ఐదు బంతులు మిగిలి వుండగానే విజయం సాధించింది.



భారత బౌలర్లు భళా..

ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ దిగడమే తరువాయి భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఆశిష్ నెహ్రా వేసిన తొలి బంతికి బౌండరీ సాధించిన ఉస్మాన్ ఖావాజా.. ఆ తరువాత బూమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో మరింత రెచ్చిపోయాడు. ఆ ఓవర్ నాలుగు ఫోర్లు కొట్టి ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో రెండో ఓవర్ ముగిసే సరికి ఆసీస్ ఖాతాలో 21 పరుగులు చేరాయి. ఆపై నెహ్రా వేసిన మూడో ఓవర్ లో అరోన్ ఫించ్, ఖవాజాలు  కలిసి 10 పరుగులు సాధించి తమ జోరును యథావిధిగా కొనసాగించారు. ఆ సమయంలో అశ్విన్ ను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. అశ్విన్ వేసిన నాల్గో ఓవర్ లో మరింత వేగం పెంచిన ఆసీస్  22 పరుగులను పిండుకుంది. దీంతో నాల్గో ఓవర్ ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు నమోదు చేసింది. ఇక ఐదో ఓవర్ ను అందుకున్న నెహ్రా రెండో బంతికే ఖవాజాను పెవిలియన్ కు పంపి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఖవాజా ఆఫ్ స్టంప్ కు బయటకు వెళుతున్న బంతిని కట్ చేయబోయి ధోనికి చిక్కాడు. దాంతో ఆసీస్ స్కోరు బోర్డులో వేగం క్రమేపి తగ్గుతూ వచ్చింది.  ఆ సమయంలో ఫించ్ తో కలిసిన డేవిడ్ వార్నర్ పరుగులు సాధించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో ముందుకొచ్చి ఆడబోయిన వార్నర్ ను ధోని స్టంపింగ్ చేయడంతో ఆసీస్ 72 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది.

 

ఆ తరువాత రెండు పరుగుల వ్యవధిలో  స్టీవ్ స్మిత్ పెవిలియన్ కు చేరాడు. యువరాజ్ సింగ్ బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు స్మిత్. అయితే ఆసీస్ కీలక వికెట్లను చేజార్చుకోవడంతో ఓపెనర్ గా వచ్చిన అరోన్ ఫించ్ తన దూకుడును కొద్దిగా తగ్గించాడు. దీంతో 13 ఓవర్ లో కానీ ఆసీస్ 100 పరుగుల మార్కును చేరలేకపోయింది. అదే సమయంలో పాండ్యా బౌలింగ్ లో భారీ షాట్ కు పోయి ధావన్ చేతికి చిక్కాడు ఫించ్. ఆపై మ్యాక్స్ వెల్, షేన్ వాట్సన్ లు స్కోరును పెంచుదామని చేసిన ప్రయత్నాన్ని భారత బౌలర్లు సమర్దవంతంగా తిప్పికొట్టారు. ఆసీస్ రెండొందలకు పైగా స్కోరు నమోదు చేస్తుందని  భావించిన తరుణంలో భారత బౌలర్లు విశేషంగా రాణించడం నిజంగా అభినందనీయమే.

మరిన్ని వార్తలు