'భారత ప్రదర్శన నిరాశపరుస్తోంది'

10 Oct, 2014 01:33 IST|Sakshi
'భారత ప్రదర్శన నిరాశపరుస్తోంది'

బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: క్రికెట్‌లో నెలకొన్న చాలా సమస్యలను బీసీసీఐ పరిష్కరించాల్సిన అవసరం ఉందని బోర్డు సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అందులో ముఖ్యంగా విదేశాల్లో జాతీయ జట్టు ప్రదర్శనను మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘టెస్టుల్లో భారత్ ప్రదర్శన నిరాశపరుస్తోంది. లార్డ్స్‌లో గెలిచిన తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్ నెగ్గే అవకాశాన్ని చేజార్చుకున్నాం. దురదృష్టవశాత్తు ఏ అంశం మనకు కలిసి రాలేదు. గతంలో ఎదురైన పరాభావాల నుంచి చాలా నేర్చుకోవాలి. టెస్టుల్లో వ్యూహాలను కూడా పకడ్బందిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

రాబోయే ఆస్ట్రేలియా టూర్ చాలా ప్రధానమైంది. కాబట్టి బీసీసీఐ వీటిపై కూడా దృష్టిపెట్టాలి’ అని ఠాకూర్ పేర్కొన్నారు. రిజర్వ్ బెంచ్ సామర్థ్యాన్ని పెంచితే జట్టులోని ఇతర ఆటగాళ్లను రొటేట్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఆటగాళ్ల గాయాలు, పునరావాస చికిత్సపై ఎక్కువగా దృష్టిపెడితే .. క్రికెటర్లు మరింత మెరుగ్గా రాణిస్తారని చెప్పారు. ‘భిన్నమైన అంశాలపై దృష్టిపెట్టాలి. అంతర్జాతీయ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలను తయారు చేయాలి. అలాగే దేశవాళీ మ్యాచ్‌లను సమర్థంగా నిర్వహించడంతో పాటు నాణ్యమైన పిచ్‌లను తయారు చేయాలి’ అని ఠాకూర్ వెల్లడించారు. భారత క్రికెట్‌కు సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. డంకన్ ఫ్లెచర్ తర్వాత కోచ్ పదవికి భారతీయుడైనా, విదేశీయుడైనా... సరైన వ్యక్తిని నియమించాలన్నారు. కిర్‌స్టెన్, జాన్ రైట్ హయాంలో భారత్ బాగా రాణించిందని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు