విండీస్‌ను కూల్చేశారు..

14 Oct, 2018 16:13 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా బౌలర్ల విజృంభణతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 127 పరుగులకే చాపచుట్టేసింది. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ను టీమిండియా బెంబేలెత్తించింది. ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, కీరన్‌ పావెల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించిన భారత్‌.. ఆపై అదే దూకుడుతో విండీస్‌కు చుక్కలు చూపించింది. సునీల్‌ అంబ‍్రిస్‌(38;95 బంతుల్లో 4 ఫోర్లు), షాయ్‌ హోప్‌(28; 42 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించగా, మిగతా వారు చేతులెత్తేశారు. ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. ఫలితంగా భారత్‌కు 72 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తాచాటిన ఉమేశ్‌ యాదవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం చెలరేగి బౌలింగ్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను సాధించాడు. దాంతో మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకుని తన టెస్టు కెరీర్‌లో తొలిసారి ఆ ఘనతను లిఖించుకున్నాడు. అతనికి జతగా రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ రెండు  వికెట్లు తీశాడు. కుల్డీప్‌కు వికెట్‌ దక్కింది. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌట్‌ అయింది. విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ 5 వికెట్లతో భారత్‌ జోరుకు బ్రేక్‌ వేశాడు. 308/4 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. 14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తొలుత అజింక్యా రహానే (80) ఔట్‌ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు. గత టెస్ట్‌లో సెంచరీతో ఆకట్టుకున్న జడేజా ఈ మ్యాచ్‌లోపూర్తిగా నిరాశపరిచాడు. మరొకొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషబ్‌ పంత్‌(92: 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను గాబ్రియల్‌ దెబ్బతీశాడు. దీంతో పంత్‌ మరోసారి శతకాన్ని చేజార్చుకుని పెవిలియన్‌ చేరాడు. గత రాజ్‌కోట్‌ టెస్ట్‌లో సైతం పంత్‌ 92 పరుగులకే వెనుదిరగడం గమనార్హం. చివర్లో అశ్విన్‌ టెయిలండర్లు కుల్‌దీప్‌(6), ఉమేశ్‌ యాదవ్‌(2), ఠాకుర్‌ (4) సాయంతో 45 పరుగులు జోడించాడు. చివర్లో అశ్విన్‌ (35) ఔట్‌ కావడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 

అయ్యో పంత్‌! మళ్లీనా?

చెలరేగిన హోల్డర్‌.. భారత్‌ 367 ఆలౌట్‌

మరిన్ని వార్తలు