టీమిండియా విదేశీ సిరీస్‌లు గెలవాలంటే..

10 Sep, 2018 11:34 IST|Sakshi

బెంగళూరు: నాణ్యమైన బ్యాట్స్‌మెన్లతో పాటు బలమైన బౌలింగ్‌ లైనప్‌ ప్రస్తుత టీమిండియా క్రికెట్‌ జట్టు సొంతమని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. కానీ విదేశాల్లో మ్యాచ్‌లకు వచ్చేసరికి భారత క్రికెట్‌ జట్టు మానసిక స్థైర్యాన్ని కోల్పోతుందని పేర్కొన్నాడు. టీమిండియా విదేశీ సిరీస్‌లను గెలవాలంటే ముందుగా  మానసికంగా మరింత ధృడంగా తయారు కావాలన్నాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై గిల్‌క్రిస్ట్‌ ప్రశంసలు కురిపించాడు.

‘ విదేశీ సిరీస్‌లు ఎవరికైనా సవాల్‌తో కూడుకున్నవే. భారత జట్టు బౌలింగ్‌ యూనిట్‌, బ్యాటింగ్‌ విభాగం చాలా పటిష్టంగా ఉంది. విరాట్‌ కోహ్లి వంటి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ భారత జట్టులో ఉన్నాడు. విదేశాల్లో సిరీస్‌లను గెలిచే సత్తా భారత జట్టుకు ఉంది. కాకపోతే ఇక్కడ తగినంత మానసిక ధృడత్వం కావాలి’ అని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు. మరొకవైపు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా కోల్పోవడంపై మాట్లాడటానికి గిల్‌క్రిస్ట్‌ నిరాకరించాడు. ఈ సిరీస్‌ లైవ్‌ను తాను చూడలేదని, కేవలం హైలెట్స్‌ మాత్రమే చూశానన్నాడు. దాంతో సిరీస్‌లో టీమిండియా ఓవరాల్‌ ప‍్రదర్శనపై కామెంట్‌ చేయడం సరైనది కాదన్నాడు. కాకపోతే భారత జట్టు చిరస్మరణీయమైన విజయాలు సాధించడంలో కెప్టెన్‌ కోహ్లి పాత్ర ప్రధానమన్నాడు. జట్టును సానుకూల ధోరణితో కోహ్లి నడిపించే తీరు అద్భుతంగా ఉందన్నాడు. తనకు కోహ్లిలో నచ్చేది అతని దూకుడేనని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు