భారత్‌ సూపర్‌  పవర్‌ కావాలి

17 Jan, 2019 02:06 IST|Sakshi

విరాట్‌ కోహ్లి ఆకాంక్ష

అడిలైడ్‌: ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ ఆధిపత్యం కొనసాగాలని, సూపర్‌ పవర్‌గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని టీమిండియా సారథి కోహ్లి చెప్పాడు. విశ్వవ్యాప్తంగా భారతీయులు ఉన్న నేపథ్యంలో మనం టెస్టులకు ప్రాధాన్యమిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ వస్తుందని చెప్పుకొచ్చాడు. కుర్రాళ్లు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌ౖపైనే ఆసక్తి పెంచుకోవడం ఎంతమాత్రం తగదని... అసలైన ఆట అయిన ‘టెస్టు’లపై కూడా దృష్టి పెట్టాలని కోహ్లి సూచించాడు. ఓ స్పోర్ట్స్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘వన్డేలు, టి20లు కూడా క్రికెటే! అందులో  రాణించాలనుకోవడంలో తప్పులేదు. అయితే వాటికే పరిమితమవడం... టెస్టులను చిన్నచూపు చూడటం తప్పు. కుర్రాళ్లు చాలామంది సంప్రదాయ టెస్టులకు విలువ ఇవ్వడం లేదు. ఇది వారి కెరీర్‌కు ఎంతమాత్రం మంచిది కాదు. ఇలా చేస్తే ఒత్తిడి ఎదుర్కోలేక మానసిక సమస్యలు తప్పవు.

తద్వారా కెరీర్‌ను కొనసాగించలేకపోవచ్చు’ అని కుర్రాళ్లను హెచ్చరించాడు. ఐదు రోజుల ఆట ఆడేందుకు కుర్రాళ్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలన్నాడు. ‘ఏదో రెండు గంటలు ఆడటం, కొన్ని ఓవర్లు వేయటం ఆటను ముగించడం సరైన పద్ధతి కానేకాదు. కుర్రాళ్లు అసలైన టెస్టు మజాకు అలవాటు పడాలి. మన విజన్‌ను బట్టి అభిమానులుంటారు. టెస్టుల్ని ఆసక్తికరంగా ఆడితే తప్పకుండా ప్రేక్షకులు పెరుగుతారు. భారతీయులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. ఇదే మన బలం. ఐదు రోజుల ఆటను గౌరవిస్తే, మనం టెస్టుల్ని శాసిస్తే, సంప్రదాయ క్రికెట్‌ అగ్రస్థానంలో ఉంటుంది’ అని అన్నాడు. రాబోయే రోజుల్లో టెస్టు క్రికెట్లో భారత్‌ దుర్భేద్యమైన జట్టుగా ఎదగాలని తాను ఆశిస్తున్నట్లు కోహ్లి చెప్పాడు.  

మరిన్ని వార్తలు