నాకు నీతులు చెబుతావా!

30 Jun, 2016 07:48 IST|Sakshi
నాకు నీతులు చెబుతావా!

రవిశాస్త్రిపై గంగూలీ ఎదురు దాడి
ఇంటర్వ్యూకు హాజరు కాకుండా విహారయాత్రలా అంటూ చురక

 

కోల్‌కతా: అనిల్ కుంబ్లేను భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయడంపై రాజుకున్న అసంతృప్తి అగ్గి చల్లారలేదు. కోచ్ అభ్యర్థిని అగౌరవపరిచాడని, తన బాధ్యత మరిచాడని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించాడు. ‘శాస్త్రి వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. నా కారణంగా కోచ్ కాలేకపోయానని ఆయన భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఆయన పిచ్చివాళ్ల ప్రపంచంలో బతుకుతున్నట్లే లెక్క’ అని అతను వ్యాఖ్యానించాడు. ‘మరోసారి ఇలాంటి సమావేశం ఉంటే గైర్హాజరు కావొద్దంటూ సలహా ఇస్తానన్న’ శాస్త్రి మరో వ్యాఖ్య కూడా దాదాకు చిర్రెత్తించింది. నీతులు చెప్పే ముందు ఆయనేం చేశాడో గుర్తు చేసుకోవాలని గంగూలీ సలహా ఇచ్చాడు.  ‘భారత క్రికెట్ జట్టు కోచ్‌లాంటి ప్రతిష్టాత్మక పదవి కోసం ఎంపిక జరుగుతుంటే నేరుగా హాజరై ఇంటర్వ్యూ ఇవ్వాలి.


కుంబ్లేలాంటి ఒక దిగ్గజ క్రికెటర్ రెండు గంటల పాటు ఓపిగ్గా కూర్చొని తన గురించి చెప్పుకుంటే ఈయన బ్యాంకాక్‌లో సరదాగా షికారు చేస్తూ కెమెరాలో ప్రజెంటేషన్ ఇస్తే ఎలా’ అని సౌరవ్ విరుచుకుపడ్డాడు. ‘క్యాబ్’ సమావేశాన్ని 14 రోజుల ముందే నిర్ణయించగా, కోచ్ ఎంపికకు రెండు రోజుల ముందే సమయం అడిగారని గంగూలీ వివరణ ఇచ్చాడు. వాస్తవానికి రవిశాస్త్రి కోసం కేటాయించిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అయితే ఇంటర్వ్యూలు సుదీర్ఘంగా సాగడం వల్ల ఆలస్యమైందని... మధ్యలో వెళ్లేందుకు తాను బీసీసీఐ అనుమతి తీసుకున్నట్లు వెల్లడించాడు.      

 

మరిన్ని వార్తలు