మన ఆటకు మంచిరోజులు!

30 Dec, 2016 00:20 IST|Sakshi

అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత వెలుగులు
కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై ఈ సంవత్సరం కూడా భారత క్రీడాకారులు తమదైన ముద్ర వేశారు. మరీ ముఖ్యంగా క్రీడాకారిణులు అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్‌... రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్‌... టెన్నిస్‌లో సానియా మీర్జా తమ ప్రతిభాపాటవాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి విజయాలతోపాటు వివాదాలు, వైఫల్యాలు కూడా భారత క్రీడాభిమానులను పలుకరించాయి. రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌–నర్సింగ్‌ యాదవ్‌ వివాదం... ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇద్దరు అథ్లెట్స్‌ డోపింగ్‌లో పట్టుబడటం... మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ రియో బెర్త్‌ పొందకపోవడం...2016లో ఇతర విశేషాలు.   – సాక్షి క్రీడావిభాగం

‘సూపర్‌’ సానియా...
మహిళల డబుల్స్‌ టెన్నిస్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సానియా మీర్జా వరుసగా రెండో ఏడాది సీజన్‌ను టాప్‌ ర్యాంక్‌తో ముగించింది. ఈ ఏడాది సానియా ఎనిమిది టైటిల్స్‌ సాధించింది. హింగిస్‌తో కలిసి బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్‌ ఓపెన్, రోమ్‌ ఓపెన్, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ టోర్నీలలో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో కలసి సిన్సినాటి ఓపెన్, టోక్యో ఓపెన్‌లలో, మోనికా నికెలెస్కూ (రొమేనియా)తో కలసి న్యూ హవెన్‌ ఓపెన్‌లో టైటిల్స్‌ సాధించింది. రియో ఒలింపిక్స్‌లో రోహన్‌ బోపన్నతో కలసి సానియా మీర్జా కాంస్య పతక పోరులో ఓడిపోయింది. లియాండర్‌ పేస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో హింగిస్‌తో జతగా టైటిల్‌ నెగ్గి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ‘కెరీర్‌ స్లామ్‌’ పూర్తి చేసుకున్నాడు.

రాకెట్‌ దూసుకెళ్లింది...
భారత్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న బ్యాడ్మింటన్‌ క్రీడలో ఈసారీ మనోళ్లు మెరిశారు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌ విభాగంలో రజత పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అనంతరం చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీలో విజేతగా నిలిచి తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. హాంకాంగ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా కూడా నిలిచింది. ఈ ప్రదర్శనతో సింధు సీజన్‌ ముగింపు టోర్నీ ‘వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌’కు అర్హత పొందింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ద్వారా ఈ ఏడాది అత్యంత మెరుగైన క్రీడాకారిణి పురస్కారాన్ని కూడా గెల్చుకుంది.

మరోవైపు సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను నెగ్గిన సైనా... రియో ఒలింపిక్స్‌లో మాత్రం గాయం కారణంగా లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. మరో తెలుగు అమ్మాయి రుత్విక శివాని రష్యా గ్రాండ్‌ప్రిలో, దక్షిణాసియా క్రీడల్లో విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌ రియో ఒలింపిక్స్‌కు అర్హత పొంది క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రణయ్‌ స్విస్‌ ఓపెన్, సాయిప్రణీత్‌ కెనడా ఓపెన్, సౌరభ్‌ వర్మ చైనీస్‌ తైపీ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించగా... సమీర్‌ వర్మ హాంకాంగ్‌  ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. సిక్కి రెడ్డి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రష్యా గ్రాండ్‌ప్రి, బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి టైటిల్స్‌ను దక్కించుకుంది. సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జంట కెనడా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ జోడీగా గుర్తింపు పొందింది.

జిగేల్‌మన్న జాతీయ క్రీడ...
ఈ యేడు జాతీయ క్రీడ హాకీ మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీలో రజతం... ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో స్వర్ణం... సొంతగడ్డపై జూనియర్‌ ప్రపంచకప్‌ను సాధించడంతో మన హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా హాకీ ఇండియా చీఫ్‌ నరీందర్‌ బాత్రా ఎన్నికయ్యారు. రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోగా... 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత మహిళల జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది.

హారిక అదే జోరు...
గతేడాది ఆన్‌లైన్‌ చెస్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఈ ఏడాదీ నిలకడగా రాణించింది. జూన్‌లో వరుసగా రెండు వారాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీలు నెగ్గిన హారిక... ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ టోర్నీలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ హూ ఇఫాన్‌పై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత చైనాలోని చెంగ్డూలో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

అద్వానీ అదరహో...
క్యూ స్పోర్ట్స్‌ (స్నూకర్, బిలియర్డ్స్‌)లో భారత స్టార్‌ పంకజ్‌ అద్వానీ ఈసారి మళ్లీ సత్తా చాటుకున్నాడు. బెంగళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్‌ (150 అప్‌ ఫార్మాట్‌) చాంపియన్‌షిప్‌లో అద్వానీ విజేతగా నిలిచి తన ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్‌ను జమచేసుకున్నాడు. భారత్‌కే చెందిన ధ్రువ్‌ సిత్వాలా ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌ నిలబెట్టుకోగా... ధర్మేందర్‌ మాస్టర్స్‌కేటగిరీలో ప్రపంచ చాంపియన్‌ అయ్యాడు.

ఆ నలుగురు...
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం, కాంస్యమే లభించినా... అదే వేదికపై జరిగిన పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం దక్కడం విశేషం. మహిళల షాట్‌పుట్‌లో దీపా మలిక్‌ రజతం... పురుషుల హైజంప్‌లో తంగవేలు మరియప్పన్‌ స్వర్ణం, వరుణ్‌ సింగ్‌ భటి కాంస్యం గెలిచారు. జావెలిన్‌ త్రోలో దేవేంద్ర జజరియా పసిడి పతకాన్ని సాధించాడు.  

అజేయ విజేందర్‌...
ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో తనకు ఎదురులేదని భారత స్టార్‌ విజేందర్‌ సింగ్‌ తన పంచ్‌ పవర్‌తో నిరూపించుకున్నాడు. జులైలో భారత్‌లో జరిగిన బౌట్‌లో కెర్రీ హోప్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచిన విజేందర్‌ ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ నెలలో టాంజానియా బాక్సర్‌ ఫ్రాన్సిస్‌ చెకాను నాకౌట్‌ చేసి విజేందర్‌ ఈ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఈ ఏడాది విజేందర్‌ పోటీపడిన ఐదు బౌట్‌లలో అజేయంగా నిలువడం విశేషం. ఇక రియో ఒలింపిక్స్‌లో మాత్రం భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. శివ థాపా, మనోజ్‌ కుమార్, వికాస్‌ క్రిషన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయారు.

‘పట్టు’ సడలించారు...
సాక్షి మలిక్‌ అద్భుత ప్రదర్శన తప్పిస్తే ఈ ఏడాది భారత రెజ్లింగ్‌ తమ ‘పట్టు’ను సడలించింది. రియో ఒలింపిక్స్‌లో సాక్షి మలిక్‌ మహిళల 58 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న యోగేశ్వర్‌ దత్‌ (61 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. 74 కేజీల విభాగంలో తనకూ, నర్సింగ్‌కు ట్రయల్స్‌ నిర్వహించి... గెలిచిన వారిని రియో ఒలింపిక్స్‌కు పంపించాలని స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ చేసిన అభ్యర్థనను భారత రెజ్లింగ్‌ సమాఖ్య పట్టించుకోలేదు. అయితే చివరి నిమిషంలో నర్సింగ్‌ యాదవ్‌ డోపింగ్‌లో దొరికిపోవడంతో ఈ విభాగంలో భారత ప్రాతినిధ్యం లేకుండాపోయింది.

‘కూత’ అదిరింది....
ప్రొ కబడ్డీ లీగ్‌తో గ్రామీణ క్రీడ కబడ్డీకి ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ఈసారి రెండుసార్లు ఈ లీగ్‌ను నిర్వహించారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. అనూప్‌ కుమార్‌ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో 38–29తో ఇరాన్‌ను ఓడించింది. ఓవరాల్‌గా భారత జట్టుకిది వరుసగా మూడో ప్రపంచకప్‌ టైటిల్‌ కావడం విశేషం.

దీపా త్రుటిలో...
రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌ వాల్ట్‌ ఈవెంట్‌ ఫైనల్లో దీపా కర్మాకర్‌ 15.066 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. అంతకుముందు రియోలోనే జరిగిన టెస్ట్‌ ఈవెంట్‌లో దీపా రాణించి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

నీరజ్‌ సంచలనం
అథ్లెటిక్స్‌లో హరియాణా యువ సంచలనం నీరజ్‌ చోప్రా అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జావెలిన్‌ను అతను 86.48 మీటర్ల దూరం విసిరి ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రదర్శన మినహా అథ్లెటిక్స్‌లో ఈ ఏడాది మనకు నిరాశే మిగిలింది. రియో బెర్త్‌ సాధించిన ధరమ్‌వీర్‌ సింగ్‌ (200 మీటర్లు), ఇందర్జీత్‌ సింగ్‌ (షాట్‌పుట్‌) డోపింగ్‌లో పట్టుబడి ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యారు.

అడపాదడపా మెరుపులు...
ఫుట్‌బాల్‌లో ఈ సంవత్సరం భారత జట్టు అడపాదడపా మెరిపించింది. ఏఎఫ్‌సీ కప్‌లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు రన్నరప్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్లబ్‌గా గుర్తింపు పొందింది. సునీల్‌ చెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఏడోసారి దక్షిణాసియా (శాఫ్‌) చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 135వ స్థానానికి చేరుకొని ఆరేళ్ల తర్వాత తమ అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించింది.

మరిన్ని వార్తలు