భారత్‌ ఖేల్‌ ఖతం 

22 Mar, 2019 01:49 IST|Sakshi

హాంకాంగ్‌: ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కథ ముగిసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా గురువారం చైనీస్‌ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–3తో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో అష్మితా చాలిహ, పురుషుల డబుల్స్‌లో అరుణ్‌ జార్జ్‌–సన్యం శుక్లా జంట గెలుపొందినా... మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో భారత్‌కు నిరాశ తప్పలేదు. తొలి మ్యాచ్‌లో అరుణ్‌ జార్జ్‌–సన్యం శుక్లా ద్వయం 21–17, 17–21, 21–14తో ప్రపంచ నెం.14 జోడీ లియో మిన్‌ చున్‌–చింగ్‌ హెంగ్‌ను కట్టడి చేసింది.

రెండో మ్యాచ్‌లో 19 ఏళ్ల అష్మిత 21–18, 17–21, 21–19తో లియాంగ్‌ టింగ్‌ యును ఓడించడంతో భారత్‌ 2–0తో ముందంజ వేసింది. అయితే మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ 7–21, 21–16, 21–23తో వాంగ్‌ జు వీ చేతిలో, మహిళల డబుల్స్‌లో ఆరతి సారా సునీల్‌–రుతుపర్ణా పండా 19–21, 17–21తో చాంగ్‌ చింగ్‌ హు–యాంగ్‌ చింగ్‌ టున్‌ చేతిలో ఓడటంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లోనూ శిఖా గౌతమ్‌–శ్లోక్‌ రామచంద్రన్‌ జంట 15–21, 14– 21తో షీ పెయ్‌ షాన్‌–సెంగ్‌ మిన్‌ హావో జోడీ చేతిలో ఓడటంతో భారత్‌ వెనుదిరగాల్సి వచ్చింది. 
 

మరిన్ని వార్తలు