మనదే ‘ఎమర్జింగ్’ టైటిల్

10 Apr, 2017 12:23 IST|Sakshi
మనదే ‘ఎమర్జింగ్’ టైటిల్
టోర్నీ ఎలాంటిదైనా ..... ఆడేది సీనియర్లయినా... జూనియర్లయినా... పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రం భారత్‌దే ఆధిపత్యం. జాతీయ జట్టు నుంచి వస్తున్న ఈ సంప్రదాయం ఇప్పుడు తృతీయ శ్రేణి జట్టు కూడా కొనసాగించింది. ఆదివారం జరిగిన ఏసీసీ ఎమర్జింగ్ టోర్నీ ఫైనల్లో 9 వికెట్ల తేడాతో దాయాది దేశం దుమ్ముదులిపిన యువ భారత్ సగర్వంగా ట్రోఫీని అందుకుంది.
 
 సింగపూర్: బ్యాటింగ్‌లో లోకేష్ రాహుల్ (107 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్సర్), బౌలింగ్‌లో బాబా అపరాజిత్ (3/28) దుమ్మురేపడంతో... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ ట్రోఫీని భారత అండర్-23 జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం కళింగ మైదానంలో జరిగిన ఫైనల్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 47 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఉమర్ వాహిద్ (64 బంతుల్లో 41; 4 ఫోర్లు), ఉస్మాన్ ఖదిర్ (32 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. రిజ్వాన్ (21), సలావుద్దీన్ (15), ఎహ్‌సాన్ ఆదిల్ (20 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడారు. 
 
 భారత బౌలర్ల ధాటికి మిడిలార్డర్ ఘోరంగా విఫలం కావడంతో పాక్ 19 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో 88/3 స్కోరుతో ఉన్న దాయాది జట్టు ఒక్కసారిగా 107/9కు పడిపోయింది. సలావుద్దీన్, వాహిద్‌లు రెండో వికెట్‌కు 54; ఖదిర్, ఆదిల్ పదో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సందీప్ శర్మ, సూర్యకుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 33.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ (15) నిరాశపర్చినా.. రాహుల్, మన్‌ప్రీత్ జునేజా (77 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) రెండో వికెట్‌కు అజేయంగా 132 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రజా హసన్‌కు ఒక్క వికెట్ దక్కింది. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 
 
>
మరిన్ని వార్తలు