హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లోకి..

27 Feb, 2020 12:43 IST|Sakshi

మెల్‌బోర్న్‌:  మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో  భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గ్రూప్‌-ఎలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియా సెమీస్‌ బెర్తును అందరికంటే ముందుగా ఖాయం చేసుకుంది. కివీస్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
 

దాంతో 134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్‌ వరకూ కివీస్‌ పోరాడినా విజయాన్ని సాధించలేకపోయింది. చివరి ఓవర్‌లో కివీస్‌ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో ఆ జట్టు 11 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.. కివీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో అమేలియా కెర్‌(34 నాటౌట్‌; 19 బంతుల్లో 6 ఫోర్లు) చివరి వరకూ పోరాటం కొనసాగించగా, మ్యాడీ గ్రీన్‌(24), క్యాటీ మార్టిన్‌(25)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలింగ్‌లో శిఖా పాండే, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.( ఇక్కడ చదవండి: నైట్‌ సెంచరీ: ఇంగ్లండ్‌ భారీ విజయం)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. న్యూజిలాండ్‌తో  మ్యాచ్‌లో షపాలీ(34 బంతుల్లో46; 4ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్‌ గెలిచిన కివీస్‌.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో  ఓపెనర్‌ స్మృతి మంధాన (11) వచ్చి వెళ్లగా.. అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా కాసేపు మెరుపులు మెరిపించారు. అయితే అదే ఊపులో రోజ్‌మెరి బౌలింగ్‌లో తానియా(23) క్యాచ్‌ ఔటాయ్యారు. అయితే మరోవైపు షఫాలీ తనదైన రీతిలో బ్యాటింగ్‌ చేస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పదిఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. 

అయితే పదకొండో ఓవర్‌ నుంచి కివీస్‌ గేమ్‌ ప్లాన్‌ మార్చింది. భారత బ్యాటర్స్‌కు ఊరించే బౌలింగ్‌ వేస్తూ వికెట్లను పడగొట్టింది. అయితే కీవీస్‌ ప్లేయర్స్‌ అనే క్యాచ్‌లను జారవిడచడంతో టీమిండియా బ్యాటర్‌కు అనేక అవకాశాలు లభించాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమ్యారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్‌(10) నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఇన్నింగ్స్‌ చివరి బంతి వరకు సాగింది. హర్మన్‌(1), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దాంతో భారత్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. అయినప్పటికీ ఆ స్కోరును కాపాడుకుని మరో గెలుపును అందుకోవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. గ్రూప్‌ స్టేజ్‌లో భారత మహిళలు తమ చివరి మ్యాచ్‌ను శనివారం శ్రీలంకతో ఆడనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు