తుది పోరులో భారత్‌కు నిరాశ 

16 Dec, 2018 02:03 IST|Sakshi

ఎమర్జింగ్‌ కప్‌ విజేత శ్రీలంక  

కొలంబో: చివరి ఓవర్‌దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. అజేయంగా ఫైనల్‌ చేరిన భారత జట్టుకు తుదిపోరులో ఆతిథ్య శ్రీలంక జట్టు చేతిలో చుక్కెదురైంది. శనివారం జరిగిన ఫైనల్లో జయంత్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత జట్టు మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా... అతీత్‌ సేథ్‌ (15 బంతుల్లో 28 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) 16 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. లీగ్‌ దశలో లంకను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్‌ తుదిపోరులో ఆ ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. హసిథ బోయగొడ (54; 8 ఫోర్లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కమిందు మెండిస్‌ (61; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో అంకిత్‌ రాజ్‌పుత్‌ 2, షమ్స్‌ ములాని, మయాంక్‌ మార్కండే, జయంత్, నితీశ్‌ రాణా తలా ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలో దిగిన భారత్‌ 9 వికెట్ల నష్టానికి 267 పరుగులకు పరిమితమైంది. జయంత్‌ యాదవ్‌ (71; 5 ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా... ములాని (46; 5 ఫోర్లు), నితీశ్‌ రాణా (40; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించారు.    

మరిన్ని వార్తలు