సిరీస్‌ వేటలో మహిళలు

29 Jan, 2019 01:35 IST|Sakshi

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌ గడ్డపై భారత పురుషుల జట్టు తమ హవా కొనసాగించి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న మహిళల జట్టు కూడా సిరీస్‌ విజయంపై కన్నేసింది. నేపియర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకున్న మిథాలీ సేన నేడు కివీస్‌తో రెండో వన్డేకు సన్నద్ధమైంది. గత మ్యాచ్‌లో మన అమ్మాయిలు ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు. ఇదే జోరును కొనసాగిస్తే మరో విజయం ఖాయమవుతుంది. స్మృతి మంధాన అద్భుత సెంచరీకి తోడు జెమీమా రోడ్రిగ్స్‌ చెలరేగడంతో విజయం కోసం మరో బ్యాట్స్‌మన్‌ అవసరమే రాలేదు. మిథాలీ రాజ్, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా జత కలిస్తే భారత్‌ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో మన ముగ్గురు స్పిన్నర్లు ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్, దీప్తి శర్మ కివీస్‌ను పూర్తిగా కట్టి పడేశారు. వీరినుంచి మరోసారి అదే తరహా ప్రదర్శనను ఆశించవచ్చు.

ఆల్‌రౌండర్లు హేమలత, శిఖా పాండేలతో పాటు వికెట్‌ కీపర్‌ తాన్యా భాటియా కూడా కీలకం కానుంది. అటు అగ్రశ్రేణి జట్టయిన న్యూజిలాండ్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి షాక్‌కు గురి చేసింది. ఆ మ్యాచ్‌లో జట్టు టాప్‌ ప్లేయర్‌ సుజీ బేట్స్, కెప్టెన్‌ సాటర్‌వెయిట్‌ మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. దీని నుంచి తొందరగా కోలుకొని సిరీస్‌ చేజారిపోకుండా చూడాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. సోఫీ డెవిన్, అమేలియా కెర్‌ ప్రదర్శనపై కూడా జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఐసీసీ ఉమెన్‌ చాంపియన్‌షిప్‌ (2017–21)లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో గెలిచే ప్రతీ మ్యాచ్‌ భారత్‌ ఖాతాలో పాయింట్లు చేరుస్తుంది. ఫలితంగా 2021 వన్డే వరల్డ్‌ కప్‌కు నేరుగా అర్హత పొందే అవకాశాలు మరింత మెరుగవుతాయి. కాబట్టి సిరీస్‌ కోణంలోనే కాకుండా భారత్‌కు ప్రతీ గెలుపు కీలకం కానుంది.  

►ఉదయం గం.6.30 నుంచి   స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు