ఆసియా కప్‌ ఫైనల్‌; బంగ్లాదేశ్‌ లక్ష్యం 113

10 Jun, 2018 13:28 IST|Sakshi

కౌలాలంపూర్‌: ఆసియాకప్‌ టీ20లో టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 113 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌((56) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది. స్మృతీ మంధాన(7), దీప్తి శర్మ(4), మిథాలీ రాజ్‌(11), అనుజా పటేల్‌(3 ఆబ్సెంట్‌ హర్ట్‌)లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరడంతో భారత్‌ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

కాగా, ఆ దశలో హర్మన్‌ప్రీత్‌-వేదా కృష్ణమూర్తిలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. అయితే ఈ జోడి 30 పరుగులు జోడించిన తర్వాత వేదా(11) పెవిలియన్‌ చేరారు. ఆపై భారత్‌ వరుసగా వికెట్లను కోల్పోగా, హర్మన్‌ప్రీత్‌ కడవరకూ పోరాడింది. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతిని భారీ షాట్‌ కొట్టే యత్నంలో హర్మన్‌ పెవిలియన్‌ బాట పట్టడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో కుబ్రా, రుమానా అహ్మద్‌లు తలో రెండు వికెట్లు సాధించగా,సాల్మా ఖాతన్‌, జహరానా అలామ్‌ చెరో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు