శ్రీలంకకు భారీ లక్ష్యం

8 Jun, 2017 18:54 IST|Sakshi
శ్రీలంకకు భారీ లక్ష్యం

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ గురువారం శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో భారత జట్టు 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ(78;79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్(125; 128 బంతుల్లో 15 ఫోర్లు 1 సిక్స్), ఎంఎస్ ధోని(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో లంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు శిఖర్ ధావన్-రోహిత్ శర్మ లు శుభారంభం అందించారు. ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చింది.  ఈ క్రమంలోనే ముందుగా రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై శిఖర్ ధావన్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరొకవైపు చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు(నాలుగుసార్లు) నమోదు చేసిన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నారు.పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో వీరిద్దరూ 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా లంకేయులతో మ్యాచ్లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ ఘనతను నాల్గోసారి తన ఖాతాలో వేసుకుంది. 

 

రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైనప్పటికీ శిఖర్ మాత్రం మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ధోనితో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 82 పరుగుల జత చేసిన తరువాత శిఖర్ (125; 128 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. ఆపై హార్దిక్ పాండ్యా(9) ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు.  ఆ సమయంలో కేదర్ జాదవ్తో కలిసి ధోని ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఒకవైపు ధోని దూకుడుగా ఆడితే జాదవ్ మాత్రం కుదరుగా ఆడాడు. ఆ క్రమంలోనే 46 బంతుల్లో ధోని హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఇక చివర్లో జాదవ్(25 నాటౌట్;13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. లంక బౌలర్లలో మలింగా రెండు వికెట్లు సాధించగా,లక్మాల్, ప్రదీప్,పెరీరా, గుణరత్నేలకు తలో వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు