శ్రీలంకకు భారీ లక్ష్యం

31 Aug, 2017 18:12 IST|Sakshi
శ్రీలంకకు భారీ లక్ష్యం

కొలంబో:శ్రీలంకతో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా 376 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆది నుంచి లంకేయులపై విరుచుకుపడింది. రోహిత్ శర్మ(104;88 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి(131; 96 బంతుల్లో 17 ఫోర్లు 2 సిక్సర్లు) శతకాలతో దుమ్మురేపి భారీ స్కోరుకు సహకరించారు. ఓపెనర్ శిఖర్ ధావన్(4) విఫలమైనప్పటికీ రోహిత్, కోహ్లి జోడి లంకేయుల్ని చీల్చిచెండాడింది. ప్రధానంగా కోహ్లి మెరుపు బ్యాటింగ్ తో లంకేయులకు ముచ్చెమటలు పట్టించారు. తొలి హాఫ్ సెంచరీని 38 బంతుల్లో పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో 38 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. అతనికి సాయంగా రోహిత్ కూడా దాటిగా ఆడటంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ 219 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే జట్టు స్కోరు 225 పరుగుల వద్ద కోహ్లి రెండో వికెట్ గా అవుట్ కావడంతో లంక శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.

 

కోహ్లి అవుటైన కాసేపటికి హార్దిక్ పాండ్యా, రోహిత్ లు వరుస బంతుల్లో పెవిలియన్ చేరడంతో భారత్ స్కోరులో వేగం తగ్గింది. కేఎల్ రాహుల్(7) కూడా ఎంతో సేపో క్రీజ్ లో నిలబడకపోవడంతో 12 పరుగుల వ్యవధిలో భారత్ మూడు వికెట్లను నష్టపోయింది. కాగా, మనీష్ పాండే(50 నాటౌట్, 42 బంతుల్లో 4 ఫోర్లు), మహేంద్ర సింగ్ ధోని(49 నాటౌట్, 42 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్స్)లు బాధ్యాతాయుతంగా ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. లంక బౌలర్లలో మాథ్యూస్ రెండు వికెట్లు సాధించగా,లసిత్ మలింగా, విశ్వ ఫెర్నాండో, దనంజయలకు తలో వికెట్ దక్కింది.

>
మరిన్ని వార్తలు