అదరగొట్టిన టీమిండియా: పాక్‌కు భారీ లక్ష్యం

16 Jun, 2019 19:38 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. రోహిత్‌ శర్మ(140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సెంచరీకి తోడు కేఎల్‌ రాహుల్‌(57; 78 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి(77; 65 బంతుల్లో 7 ఫోర్లు)లు హాఫ్‌ సెంచరీలతో మెరవడంతో పాకిస్తాన్‌కు 337 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌-కేఎల్‌ రాహుల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్‌(57) పెవిలియన్‌ చేరాడు. రియాజ్‌ బౌలింగ్‌లో బాబర్‌ అజామ్‌కు సునాయసమైన క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.
(ఇక్కడ చదవండి: ప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్‌)

ఆ తరుణంలో కోహ్లితో కలిసి మరో 98 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన రోహిత్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. హసన్‌ అలీ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌ దిశగా షాట్‌ ఆడబోయిన రోహిత్‌ ఔటయ్యాడు. ఆ సమయంలో కోహ్లితో కలిసి హార్దిక్‌ పాండ్యా జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి 51 పరుగులు జత చేసిన తర్వాత హార్దిక్‌(26; 19 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌) మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, ధోని(1) సైతం విఫలయ్యాడు. ఆపై కోహ్లికి విజయ్‌ శంకర్‌ జత కలిశాడు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా, వర్షం వెంటనే ఆగిపోవడంతో మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైన కాసేపటికి కోహ్లి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో విజయ్‌ శంకర్‌(15 నాటౌట్‌), కేదార్‌ జాదవ్‌( 9 నాటౌట్‌)లు తలో ఫోర్‌ కొట్టడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాకిస్తాన్‌ బౌలర్లలో మహ్మద్‌ అమిర్‌ మూడు వికెట్లు సాధించగా, హసన్‌ అలీ, వహాబ్‌ రియాజ్‌లు చెరో వికెట్‌ తీశారు.(ఇక్కడ చదవండి: కోహ్లి ఖాతాలో మరో రికార్డు)


 

మరిన్ని వార్తలు