‘పాక్‌కు నయా పైసా కూడా చెల్లించొద్దు’

1 Oct, 2018 11:09 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు భారత్‌ పైసా కూడా చెల్లించాల్సిన అవసరంలేదని బీసీసీఐ మాజీ చీఫ్‌ అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టంజేశారు. ద్వైపాక్షిక సిరీస్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ బీసీసీఐపై పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) దాదాపు రూ. 500 కోట్ల నష్టపరిహారానికి దావా వేసింది. ఈ కేసుపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వివాద పరిష్కార ప్యానెల్‌ సోమవారం నుంచి దుబాయ్‌లో విచారణ జరపనుంది. ఈ మేరకు అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘పాక్‌కు పైసా కూడా చెల్లించొద్దు.  ఉగ్రవాదులకు మద్దతిచ్చే చర్యలను పాక్‌ ఆపితే.. ఆ తర్వాత ఆ దేశంతో క్రికెట్‌ ఆడే విషయం ఆలోచిస్తాం’ అని అనురాగ్‌ పేర్కొన్నారు.

మరొకవైపు ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నాకు తెలిసినంత వరకు ఈ వివాదాన్ని పీసీబీ, బీసీసీఐ పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఐసీసీ జోక్యం అవసరం లేదు. పాక్‌తో ఆడాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. కొన్ని కారణాల వల్ల పాక్‌తో ఆడేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం అవుతోంది. తటస్థ వేదికల విషయానికి వస్తే ఆసియా, ఐసీసీ ట్రోఫీల్లో పాక్‌తో భారత్‌ తలపడుతూనే ఉంది. పాక్‌కు డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదు’ అని శుక్లా అన్నారు.

మరిన్ని వార్తలు