‘వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడొద్దు’

18 Feb, 2019 12:43 IST|Sakshi
2015 వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ క్రికెట్‌ జట్లు తలపడినప్పటి దృశ్యం

ముంబై: పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇప్పటికే యావత్‌ భారతావని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తుండగా, తాజాగా పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లను మొత్తం నిషేధించాలనే ప్రతిపాదనను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తెరపైకి తీసుకొచ‍్చింది. ఇప్పటికే బ్రాబోర్న్‌ స్టేడియంలో పాక్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలను తొలగించిన సీసీఐ.. వరల్డ్‌కప్‌ వంటి మెగాటోర్నీలో సైతం పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడొద్దని భారత క్రికెట్ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేసింది. (చదవండి:పాక్‌ క్రికెట్‌కు షాక్‌ మీద షాక్‌.. పీసీబీ స్పందన)

‘దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఆ దేశ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ముందుకు రాలేదు. దీనిపై ఇమ్రాన్‌ కనీసం స‍్పందించాల్సి ఉంది. మన జవాన్ల మీద జరిగిన దాడిని మేం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. సీసీఐ క్రీడా రంగానికి చెందిందే కావచ్చు. కానీ మాకు దేశమే ముఖ్యం. తర్వాతే క్రీడలు. ఈ దాడిపై ఇమ్రాన్‌ ఖాన్‌ కచ్చితంగా మాట్లాడి తీరాలి. ఆయన పాకిస్తాన్‌ ప్రధాని. వాళ్ల దేశం వైపు ఏ తప్పూలేకపోతే ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?..అందుకే వరల్డ్‌ కప్‌లో టీమిండియా..పాకిస్థాన్‌తో ఆడకూడదు. ఈ మేరకు బీసీసీఐని కోరాం’ అని సీసీఐ సెక్రటరీ సురేశ్‌ బఫ్నా తెలిపారు. త్వరలో ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియా-పాక్‌ల మధ్య జూన్‌ 16 న  మ్యాచ్‌ జరగాల్సి ఉంది. (చదవండి:పాక్‌ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు)

మరిన్ని వార్తలు