‘కామన్వెల్త్‌’ను పక్కనపెట్టాలి: బాత్రా

26 Sep, 2019 10:12 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా కామన్వెల్త్‌ గేమ్స్‌పై చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో కలకలం రేపాయి. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బాత్రా మాట్లాడుతూ కామన్వెల్త్‌ గేమ్స్‌ను శాశ్వతంగా బాయ్‌కాట్‌ చేయాలని అన్నారు. ‘ఆ క్రీడల్లో పోటీ స్థాయి తక్కువ. చెప్పాలంటే అక్కడి ఈవెంట్లలో పోటీ ఏమంత గొప్పగా ఉండదు. కాబట్టి ఆ క్రీడలను పట్టించుకోకుండా శాశ్వతంగా పక్కనబెట్టాలి’ అని బాత్రా పేర్కొన్నారు. బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో షూటింగ్‌ను తప్పించడంపై లోగడ ఈయన ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు పతకాలను తెచ్చిపెట్టే షూటింగ్‌ను మెగా ఈవెంట్‌ నుంచి తప్పించడంతో భారత్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ)లో పాల్గొనకుండా బాయ్‌కాట్‌ చేయాలని సూచించారు.

అయితే తాజాగా శాశ్వతంగా బాయ్‌కాట్‌ చేయాలనడంపై క్రీడావర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్ర క్రీడాశాఖ, సీడబ్ల్యూజీ వర్గాలు  మాత్రం దీనిపై ఇప్పటికి ఇప్పుడే∙స్పందించేందుకు నిరాకరించాయి. టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సత్యన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు సరికాదని, దీన్ని అంగీకరించలేమని అన్నాడు. బాక్సింగ్‌ స్టార్‌ విజేందర్‌ స్పందిస్తూ ఇది అథ్లెట్ల కఠోర శ్రమను నీరుగారుస్తుందని చెప్పాడు. షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ మాట్లాడుతూ బాయ్‌కాట్‌ హాస్యాస్పదమన్నాడు. అథ్లెటిక్స్‌ పరంగా చూస్తే ఆసియా క్రీడల కంటే కామన్వెల్త్‌ గేమ్స్‌లోనే పోటీ స్థాయి ఎక్కువుంటుందని సీడబ్ల్యూజీ (2010) స్వర్ణ విజేత, అథ్లెట్‌ కృష్ణ పూనియా తెలిపింది. రెండుసార్లు స్వర్ణం గెలిచిన వెయిట్‌లిఫ్టర్‌ సతీశ్‌ శివలింగం బాయ్‌కాట్‌కు తాను వ్యతిరేకమన్నాడు. హాకీ ఆటగాళ్లు, పలు జాతీయ క్రీడా సమాఖ్యలు కూడా బాత్రా వ్యాఖ్యలు సరికాదని ప్రకటించాయి.   

మరిన్ని వార్తలు