ఆదివారానికి వాయిదా!

19 Jul, 2019 05:15 IST|Sakshi

వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా ఎంపిక 

బీసీసీఐ, సీఓఏ మధ్య మరో రగడ

న్యూఢిల్లీ: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరుగనున్న మూడు టి20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌కు శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్‌ జట్టు ఎంపిక ఆదివారానికి వాయిదా పడింది. దీంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎంతవరకు అందుబాటులో ఉంటాడు? వెటరన్‌ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం రెండు రోజుల తర్వాతే లభించనుంది. శుక్రవారం నాటి సమావేశం వాయిదాకు బీసీసీఐ కొత్త రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధన ఒక కారణం కాగా, అందరు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ నివేదికలు శనివారం నాటికి అందే వీలుండటం మరో కారణంగా తెలుస్తోంది.

మరోవైపు బీసీసీఐ కార్యదర్శి ఇప్పటివరకు సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టు ఎంపిక వివరాలు ఆయన పేరిటే విడుదలయ్యేవి. కొత్త రాజ్యాంగం ప్రకారం కార్యదర్శిని ఈ బాధ్యత నుంచి తప్పించారు. సెలక్షన్‌ కమిటీ ఛైర్మనే... కన్వీనర్‌గా ఉంటారు. ఈ విషయమై క్రికెట్‌ పాలకుల కమిటీ (సీవోఏ), బీసీసీఐ మధ్య సంఘర్షణ నెలకొంది. కొత్త నిబంధన ప్రకారం క్రికెట్‌ కమిటీ సమావేశాల్లో బోర్డు ఆఫీస్‌ బేరర్లు, సీఈఓ పాల్గొనడానికి వీల్లేదు. మరోవైపు విజయ్‌ శంకర్, శిఖర్‌ ధావన్‌ల ఫిట్‌నెస్‌ నివేదికలు కూడా ఇంకా బోర్డు అందలేదు. దాంతో జట్టు ఎంపికను ఆదివారానికి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు