ఓటమి లాంఛనం ముగిసింది

25 Feb, 2020 05:36 IST|Sakshi

తొలి టెస్టులో 10 వికెట్లతో భారత్‌ పరాజయం

రెండో ఇన్నింగ్స్‌లో 191 ఆలౌట్‌

టెస్టుల్లో న్యూజిలాండ్‌కు 100వ విజయం

సిరీస్‌లో కివీస్‌కు 1–0 ఆధిక్యం

29 నుంచి రెండో టెస్టు

అనూహ్యం, అద్భుతంలాంటివేమీ జరగలేదు. కొంత గౌరవప్రదమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచి మనోళ్లు పోరాడగలరనుకున్న ఆశా నెరవేరలేదు. టెస్టు మ్యాచ్‌ తొలి రోజు బ్యాటింగ్‌లో భారత్‌ చూపించిన తడబాటు చివరకు పరాజయం వరకు కొనసాగింది. సోమవారం ఆటలో మిగిలిన 6  భారత వికెట్లు పడగొట్టేందుకు కివీస్‌కు 16 ఓవర్లు సరిపోయాయి. 47 పరుగులు మాత్రమే టీమిండియా జోడించగా... విజయానికి అవసరమైన 9 పరుగులను రెండో ఓవర్లో కివీస్‌ అందుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో వరుసగా ఏడు టెస్టుల్లో విజయాల తర్వాత కోహ్లి సేనకు ఇది తొలి పరాజయం కాగా... ఆసీస్‌ చేతిలో మూడు మ్యాచ్‌లు ఓడిన అనంతరం సొంతగడ్డపై దక్కిన విజయంతో కివీస్‌కు ఊరట లభించింది. పైగా ఇది న్యూజిలాండ్‌కు 100వ టెస్టు విజయం కావడం ఆ జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది.   

వెల్లింగ్టన్‌: టి20, వన్డే సిరీస్‌లు సమంగా ముగిసిన తర్వాత జరుగుతున్న టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో సోమవారం నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ముగిసిన తొలి టెస్టులో కివీస్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 144/4తో ఆట ప్రారంభించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ టిమ్‌ సౌతీ 5 వికెట్లతో చెలరేగగా... ట్రెంట్‌ బౌల్ట్‌ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 183 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించగా, కివీస్‌ ముందు 9 పరుగుల లక్ష్యం నిలిచింది. ఓపెనర్లు లాథమ్‌ (7 నాటౌట్‌), బ్లన్‌డెల్‌ (2 నాటౌట్‌) కలిసి 1.4 ఓవర్లలో ఈ స్కోరు సాధించి లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 29 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది.  

అందరూ అదే దారిలో...
39 పరుగులు వెనుకబడిన స్థితిలో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు. మూడో ఓవర్లోనే రహానే (75 బంతుల్లో 29; 5 ఫోర్లు)ను కీపర్‌ క్యాచ్‌ ద్వారా బౌల్ట్‌ వెనక్కి పంపించాడు. తర్వాతి ఓవర్లోనే సౌతీ చక్కటి ఇన్‌స్వింగర్‌తో విహారి (15)ని బౌల్డ్‌ చేయడంతో ఇద్దరు ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు. మరోవైపు క్రీజ్‌లో ఉన్న కొద్ది సేపు రిషభ్‌ పంత్‌ (41 బంతుల్లో 25; 4 ఫోర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... అశ్విన్‌ (4) కూడా సౌతీ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇషాంత్‌ (12)ను గ్రాండ్‌హోమ్‌ అవుట్‌ చేయగా, తర్వాతి ఓవర్‌ వేసిన సౌతీ... పంత్, బుమ్రా (0)ల వికెట్లు తీయడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు కివీస్‌కు 10 బంతులు సరిపోయాయి.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 165; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 348; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) బౌల్ట్‌ 14; మయాంక్‌ (సి) వాట్లింగ్‌ (బి) సౌతీ 58; పుజారా (బి) బౌల్ట్‌ 11; కోహ్లి (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 19; రహానే (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 29; విహారి (బి) సౌతీ 15; పంత్‌ (సి) బౌల్ట్‌ (బి) సౌతీ 25; అశ్విన్‌ (ఎల్బీ) (బి) సౌతీ 4; ఇషాంత్‌ (ఎల్బీ) (బి) గ్రాండ్‌హోమ్‌ 12; షమీ (నాటౌట్‌) 2; బుమ్రా (సి) (సబ్‌) మిషెల్‌ (బి) సౌతీ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (81 ఓవర్లలో ఆలౌట్‌) 191.  

వికెట్ల పతనం: 1–27; 2–78; 3–96; 4–113; 5–148; 6–148; 7–162; 8–189; 9–191; 10–191. 

బౌలింగ్‌: సౌతీ 21–6–61–5; బౌల్ట్‌ 22–8–39–4; గ్రాండ్‌హోమ్‌ 16–5–28–1; జేమీసన్‌ 19–7–45–0; ఎజాజ్‌ పటేల్‌ 3–0–18–0.  

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (నాటౌట్‌) 7; బ్లన్‌డెన్‌ (నాటౌట్‌) 2; మొత్తం (1.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 9.  
బౌలింగ్‌: ఇషాంత్‌ 1–0–8–0; బుమ్రా 0.4–0–1–0.   

మరిన్ని వార్తలు