చేజారింది

14 Mar, 2019 00:45 IST|Sakshi

వన్డే సిరీస్‌ కోల్పోయిన భారత్‌  

చివరి మ్యాచ్‌లో పరాజయం

35 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా

ఉస్మాన్‌ ఖాజా సెంచరీ 

రాణించిన కంగారూ బౌలర్లు

జాదవ్, భువనేశ్వర్‌ పోరాటం వృథా  

‘లక్ష్య ఛేదనలో భారత్‌ అత్యుత్తమ జట్లలో ఒకటి. ఇవాళ దానిని చూపించాల్సి ఉంది. వరల్డ్‌ కప్‌ జట్టు కూర్పు ఎలా ఉండబోతోందో మాకు స్పష్టత వచ్చేసింది. ఇవాళ ఆడుతున్న జట్టు సమతూకంగా ఉంది’ టాస్‌ సమయంలో భారత కెప్టెన్‌ కోహ్లి వ్యాఖ్య ఇది. కానీ భారత జట్టు ఆసీస్‌ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. పైగా ఈ మ్యాచ్‌ ప్రపంచ కప్‌కు ముందు కూర్పు విషయంలో అనేక కొత్త ప్రశ్నలు కూడా రేకెత్తించింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టి20 సిరీస్‌ కోల్పోయిన తర్వాత తొలి రెండు వన్డేలు నెగ్గిన ఉత్సాహం ఆ తర్వాత నీరుగారిపోయింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌లో రెండోసారి టీమిండియా 2–0తో ఆధిక్యంలో ఉండి కూడా చివరకు అనూహ్యంగా 2–3తో సిరీస్‌ను కోల్పోయింది. 

సొంతగడ్డపై ‘ఢిల్లీ బాయ్స్‌’ శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్, కోహ్లిలతో విజయ్‌ శంకర్, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా కూడా వెనుదిరగడంతో భారత్‌ ఒక దశలో 132/6తో ఓటమికి చేరువైనట్లు అనిపించింది. కానీ కేదార్‌ జాదవ్, భువనేశ్వర్‌ ఏడో వికెట్‌కు 103 బంతుల్లోనే 91 పరుగులు జోడించి ఆశలు రేపారు. కానీ ఈ పోరాటం సరిపోలేదు. వీరిద్దరిని వరుస బంతుల్లో ఔట్‌ చేసిన ఆసీస్‌ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా తమ వైపునకు లాక్కుంది. అంతకుముందు ఉస్మాన్‌ ఖాజా చక్కటి సెంచరీకి హ్యాండ్స్‌కోంబ్‌ కూడా ఒక చేయి వేయడంతో ఆసీస్‌ మెరుగైన స్కోరు సాధించి భారత్‌కు సవాల్‌ విసరగలిగింది. ఎనిమిదో వికెట్‌కు రిచర్డ్సన్, కమిన్స్‌ కలిసి 16 బంతుల్లో జోడించిన 34 పరుగులే చివరకు మ్యాచ్‌ ఫలితంలో కీలకంగా మారడం విశేషం.   


ఢిల్లీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు తొలిసారి స్వదేశంలో వన్డే సిరీస్‌ కోల్పోయింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 35 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ ఉస్మాన్‌ ఖాజా (106 బంతుల్లో 100; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సిరీస్‌లో రెండో సెంచరీ సాధించగా, హ్యాండ్స్‌కోంబ్‌ (60 బంతుల్లో 52; 4 ఫోర్లు) రాణించాడు. భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ శర్మ (89 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా...భువనేశ్వర్‌ (54 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేదార్‌ జాదవ్‌  (57 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్‌) పోరాడారు. జంపాకు 3 వికెట్లు... కమిన్స్, స్టొయినిస్, రిచర్డ్సన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.  

ఖాజా మరో శతకం... 
ఆస్ట్రేలియాకు మరోసారి ఓపెనర్లు శుభారంభం అందించారు. ఖాజా తన ఫామ్‌ను కొనసాగిస్తూ చక్కటి షాట్లు ఆడగా, ఫించ్‌ (43 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. షమీ రెండో ఓవర్లో ఖాజా రెండు బౌండరీలు బాదగా, అతని తర్వాతి ఓవర్లో ఫించ్‌ మరో రెండు ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ఆసీస్‌ 52 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 76 పరుగులు జత చేసిన అనంతరం ఈ జోడీని జడేజా విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన హ్యాండ్స్‌కోంబ్‌ కూడా స్వేచ్ఛగా ఆడటంతో ఆసీస్‌ స్కోరు దూసుకుపోయింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో కవర్స్‌ దిశగా ఆడి సింగిల్‌ తీయడంతో సిరీస్‌లో ఖాజా రెండో సెంచరీ (102 బంతుల్లో) పూర్తయింది. 32.5 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ 175/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. మిగిలిన ఓవర్లలో చెలరేగి భారీ స్కోరు చేయడం ఖాయమనుకున్న దశలో భారత బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా ఆసీస్‌ 21 బంతుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. ఖాజాతో పాటు మ్యాక్స్‌వెల్‌ (1), హ్యాండ్స్‌కోంబ్‌ వెనుదిరిగారు. గత మ్యాచ్‌ హీరో టర్నర్‌ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌)ను ఈసారి కుల్దీప్‌ నిరోధించగా, ఆ తర్వాత వరుస ఓవర్లలో స్టొయినిస్‌ (20), క్యారీ (3) ఔటయ్యారు. అయితే జే రిచర్డ్సన్‌ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు), కమిన్స్‌ (8 బంతుల్లో 15; 2 ఫోర్లు) కలిసి ఆసీస్‌కు చెప్పుకోదగ్గ స్కోరు అందించారు.  

బుమ్రా అసహనం! 
భారత బెస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆరంభంలో ఆసీస్‌ను పూర్తిగా కట్టి పడేశాడు. తన తొలి 8 ఓవర్లలో అతను 14 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. అయితే అతని 9వ ఓవర్‌ (ఇన్నింగ్స్‌ 48వ) ఆసీస్‌కు కలిసొచ్చింది. ఈ ఓవర్లో రిచర్డ్సన్‌ వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాతి యార్కర్‌ను అతను డిఫెన్స్‌ ఆడగా బంతి బుమ్రా వద్దకు వచ్చింది. అయితే కోపంతో అతను దానిని వికెట్లపైకి విసిరాడు. స్టంప్స్‌ను తాకిన బంతి అదే వేగంతో థర్డ్‌మ్యాన్‌ బౌండరీ దిశగా దూసుకుపోవడంతో మరో నాలుగు పరుగులు వచ్చాయి. చివరి బంతికి కమిన్స్‌ కూడా ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో బుమ్రా ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు.  

ఆ ఇద్దరూ పోరాడినా... 
భారత్‌ లక్ష్య ఛేదన తడబడుతూనే సాగింది. పిచ్‌ బాగా నెమ్మదించడం, బంతి బ్యాట్‌పైకి రాకపోవడంతో పరుగులు తీయడం ఒక్కసారిగా కష్టంగా మారిపోయింది. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన శిఖర్‌ ధావన్‌ (15 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. అనూహ్యంగా దూసుకొచ్చిన స్టొయినిస్‌ బంతిని ఆడలేక కోహ్లి (22 బంతుల్లో 20; 2 ఫోర్లు) కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా, నాలుగో స్థానానికి ప్రమోట్‌ అయిన రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 16; ఫోర్, సిక్స్‌) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఇటీవల తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన విజయ్‌ శంకర్‌ (21 బంతుల్లో 16; సిక్స్‌) అత్యుత్సాహంతో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. మరోవైపు తన శైలికి భిన్నంగా ప్రతీ పరుగు కోసం శ్రమించిన రోహిత్‌ 73 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జంపా వేసిన ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌ భారత్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఆస్ట్రేలియన్లు రెండు సార్లు క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన రోహిత్‌ మూడోసారి దొరికిపోయాడు. ముందుకొచ్చి షాట్‌ ఆడే క్రమంలో బ్యాట్‌ చేజార్చుకున్న రోహిత్‌ను క్యారీ స్టంపౌట్‌ చేయగా, అదే ఓవర్లో జడేజా (0) కూడా స్టంపౌటయ్యాడు. ఇక ఓటమి లాంఛనమే అనుకున్న తరుణంలో జాదవ్, భువనేశ్వర్‌ జోడి జట్టును నడిపించింది. ఒక్కసారి నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా రెండు సిక్సర్లతో భువీ కనబర్చిన దూకుడు ఆకట్టుకుంది. అయితే 25 బం తుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో... వరుసగా రెండు బంతుల్లో భువనేశ్వర్, జాదవ్‌లు ఔటవ్వ డంతో టీమిండియా ఓటమి దిశగా పయనించింది. 

►భారత్‌లో భారత్‌పై ఐదు వన్డేల సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఉస్మాన్‌ ఖాజా (ఆస్ట్రేలియా) గుర్తింపు పొందాడు. డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా–358 పరుగులు; 2015లో) పేరిట ఉన్న రికార్డును ఖాజా తిరగ రాశాడు.  ఐదు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న వన్డే సిరీస్‌లో 0–2తో వెనుకబడి ఆ తర్వాత సిరీస్‌ గెలిచిన నాలుగో జట్టు ఆస్ట్రేలియా. గతంలో దక్షిణాఫ్రికా రెండుసార్లు (2003లో పాక్‌పై; 2016లో ఇంగ్లండ్‌పై) ఇలా చేయగా... పాక్‌ (భారత్‌పై 2005లో)... బంగ్లాదేశ్‌ (జింబాబ్వేపై 2005లో) ఒక్కోసారి ఈ ఘనత సాధించాయి.   

►ఐదు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న వన్డే సిరీస్‌లో తొలుత 2–0తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వరుస పరాజయాలతో సిరీస్‌ను రెండుసార్లు చేజార్చుకున్న తొలి జట్టుగా భారత్‌ నిలిచింది.  
వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ గుర్తింపు పొందాడు.  
కోహ్లి సారథ్యంలో స్వదేశంలో భారత జట్టు కోల్పోయిన తొలి వన్డే సిరీస్‌ ఇదే. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వన్డేలు ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. 

మరిన్ని వార్తలు