పసిడి పంట

4 Dec, 2019 00:32 IST|Sakshi

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ జోరు

టీటీలో రెండు స్వర్ణాలు

కఠ్మాండు (నేపాల్‌): దక్షిణాసియా క్రీడల్లో రెండో రోజు భారత క్రీడాకారులు పసిడి పతకాల పంట పండించారు. అథ్లెటిక్స్, వాలీబాల్, టేబుల్‌ టెన్నిస్, షూటింగ్‌ క్రీడాంశాల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకొని పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా రెండో రోజు మంగళవారం భారత్‌కు 27 పతకాలు లభించాయి. ఇందులో 13 స్వర్ణాలు ఉన్నాయి. టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ ఈవెంట్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు నెగ్గాయి. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉన్న భారత టీటీ మహిళల జట్టు ఫైనల్లో 3–0తో శ్రీలంకను ఓడించింది.

ఫైనల్స్‌ మ్యాచ్‌ల్లో సుతీర్థ ముఖర్జీ 11–9, 11–7, 11–3తో ఇషారా మధురాంగిపై, కృత్విక సిన్హా రాయ్‌ 11–6, 11–4, 11–2తో ఇరాండి వరుస్వితానాపై, ఆకుల శ్రీజ 11–5, 11–5, 11–3తో హన్సిని పియుమిలాపై నెగ్గారు. ఆంథోని అమల్‌రాజ్, హర్మీత్‌ దేశాయ్, సౌమ్యజిత్‌ ఘోష్‌ సభ్యులుగా ఉన్న భారత పురుషుల టీటీ జట్టు ఫైనల్లో 3–0తో నేపాల్‌పై గెలిచింది.  వాలీబాల్‌ ఈవెంట్‌లోనూ భారత జట్లకు రెండు స్వర్ణాలు దక్కాయి. ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 20–25, 25–15, 25–17, 29–27తో పాకిస్తాన్‌పై నెగ్గగా, భారత మహిళల జట్టు 25–17, 23–25, 21–25, 25–20, 15–6తో నేపాల్‌ను ఓడించింది.

షూటింగ్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు, 4 రజతాలు, కాంస్యంతో కలిపి తొమ్మిది పతకాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో మెహులీ ఘోష్‌... టీమ్‌ విభాగంలో భారత్‌ పసిడి పతకాలు గెలుచుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో చెయిన్‌ సింగ్‌... పురుషుల 25 మీటర్ల సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో యోగేశ్‌ సింగ్‌ స్వర్ణాలు సాధించారు. తైక్వాండోలో మహిళల 57 కేజీల విభాగంలో కశిష్‌ మలిక్‌ పసిడి పతకం నెగ్గింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు అర్చన సుశీంద్రన్‌ (మహిళల 100 మీటర్లు), జష్నా (మహిళల హైజంప్‌), సర్వేశ్‌ అనిల్‌ కుషారే (పురుషుల హైజంప్‌), అజయ్‌ కుమార్‌ సరోజ్‌ (పురుషుల 1500 మీటర్లు) బంగారు పతకాలు అందించారు. ఖో–ఖోలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా