ఆసియాకప్‌ ఫైనల్‌: భారత్‌ లక్ష్యం 223

28 Sep, 2018 20:33 IST|Sakshi

బంగ్లాదేశ్‌ 222 ఆలౌట్‌

లిటన్‌ దాస్‌ సెంచరీ పోరాటం

రాణించిన కుల్దీప్‌, జాదవ్‌

దుబాయ్‌ : భారత్‌తో జరుగుతున్న ఆసియాకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ 223 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ 121(117 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెహ్‌దీ హసన్‌(32), సౌమ్య సర్కార్‌లు(33) మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు, జాదవ్‌ రెండు వికెట్లు తీయగా, చహల్‌, బుమ్రాలు ఒక వికెట్‌ తీశారు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు రనౌట్లు కావడం విశేషం.

లిటన్‌ దాస్‌ ఒక్కడే..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఊహించని రీతిలో ఓపెనర్స్‌ శుభారంభం అందించారు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన లిటన్‌ దాస్‌.. 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్‌  మెహ్‌దీ హసన్‌(32) సాయంతో తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. 27వన్డేలనంతరం బంగ్లా ఓపెనర్స్‌ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పడం విశేషం. కానీ ఈ ఆరంభాన్ని బంగ్లా మిగతా బ్యాట్స్‌మెన్‌ అందిపుచ్చుకోలేకపోయారు.

భారత బౌలర్ల సహనానికే పరీక్ష మారిన లిటన్‌ దాస్‌- మెహ్‌దీ హసన్‌ జోడిని పార్ట్‌టైం బౌలర్‌ జాదవ్‌ విడదీసాడు. మెహ్‌దీ హసన్‌ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్‌ కైస్‌(2), ముష్ఫికర్‌ రహీమ్‌ (5), మహ్మద్‌ మిథున్‌ (2)ల వికెట్లను బంగ్లాదేశ్‌ వరుసగా కోల్పోయింది. ఈ క్రమంలో లిటన్‌ దాస్‌ 87బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్‌లతో కెరీర్‌లోనే తొలి సెంచరీ సాధించాడు. ఆ వెంటనే మహ్మదుల్లా(4)ను కుల్దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు.

ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన సౌమ్య సర్కార్‌ బాధ్యాతాయుతంగా ఆడాడు. కానీ లిటన్‌ దాస్‌, కెప్టెన్‌ మొర్తాజాలను కుల్దీప్‌ బోల్తా కొట్టించాడు. ధోని సాయంతో ఇద్దరిని స్టంపౌట్‌ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నజ్ముల్‌ ఇస్లాం(7)ను సబ్‌స్ట్యూట్‌ ఫీల్డర్‌ మనీష్‌ పాండే రనౌట్‌ చేశాడు. చివర్లో సౌమ్య సర్కార్‌ (33) కూడా రనౌట్‌ కాగా.. మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన రుబెల్ హొస్సెన్‌(0)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్‌ ముగిసింది. 48.3 ఓవర్లలో 222 పరుగులకు బంగ్లాదేశ్‌ ఆలౌట్‌ అయింది.

>
మరిన్ని వార్తలు