ఇక చావోరేవో!

27 Oct, 2013 01:19 IST|Sakshi
ఇక చావోరేవో!

కటక్: ఏడు వన్డేలు...భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రకటించినప్పుడు ఇన్ని వన్డేలా..? ఇంత సుదీర్ఘ పర్యటన అవసరమా..? అనే వ్యాఖ్యలు వచ్చాయి. అయితే వరుణుడి పుణ్యమాని అది ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌గా మారింది. రాంచీలో నాలుగోవన్డేలో వర్షం కారణంగా ఫలితం రాలేదు. తాజాగా కటక్‌లో ఐదో వన్డేలో ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. బారాబతి స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని శుక్రవారమే తేలిపోయింది.
 
 అయితే శనివారం ఉదయం అంపైర్లు నైజేల్ లాంగ్, రవి, షంషుద్దీన్ ఉదయం 11 గంటలకు మైదానాన్ని పరిశీలించారు. పిచ్ కొంత వరకు బాగున్నా, అవుట్ ఫీల్డ్ పూర్తిగా బురదగా మారడంతో ఆట సాధ్యం కాదంటూ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మ్యాచ్‌కు అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా భువనేశ్వర్‌లో హోటల్‌లోనే ఉండిపోయారు. స్టేడియానికి కూడా రాలేదు. ప్రస్తుతం సిరీస్‌లో 1-2తో వెనుకబడిన భారత్ ఇప్పుడు సిరీస్ నెగ్గాలంటే చివరి రెండు వన్డేల్లో కచ్చితంగా గెలవాలి. కాబట్టి ధోనిసేనకు రెండు మ్యాచ్‌ల్లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఆరో వన్డే బుధవారం (30న) నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన గత మూడు వన్డే సిరీస్‌లలో మొదటి రెండింటిని ఆస్ట్రేలియా 4-2 తేడాతో గెలుచుకుంది. చివరి సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు కాగా, భారత్ 1-0తో సిరీస్ నెగ్గింది.
 
 భారత్‌పైనే ఒత్తిడి: ఫించ్
 సిరీస్‌లో ప్రస్తుతం వెనుకబడి ఉండటంతో భారత్‌పైనే ఒత్తిడి నెలకొందని ఆసీస్ బ్యాట్స్‌మన్ ఫించ్ అన్నాడు. సిరీస్ గెలిచేందుకు తమకే ఎక్కువ అవకాశాలున్నాయని అతను అన్నాడు. ‘మేం ఒక మ్యాచ్ గెలిస్తే చాలు. అదే భారత్ రెండూ గెలవాల్సి ఉంది. కాబట్టి వారిపైనే కొంత ఒత్తిడి ఉండటం సహజం. ఆధిక్యంలో ఉండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం మేం చక్కటి క్రికెట్ ఆడుతున్నాం. కాబట్టి జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు.
 

మరిన్ని వార్తలు