పోరాడుతున్న భారత్‌ ‘ఎ’

2 Feb, 2020 04:03 IST|Sakshi

ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 127/2

న్యూజిలాండ్‌ ‘ఎ’ 562/7 డిక్లేర్డ్‌

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరుగుతోన్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోవడానికి భారత్‌ ‘ఎ’ పోరాడుతోంది. 346 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ శనివారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (0) ‘గోల్డెన్‌ డక్‌’గా అవుటై మరోసారి నిరాశ పరిచాడు. మరో ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (26; 1 ఫోర్‌) కూడా విఫలమయ్యాడు. అయితే ప్రియాంక్‌ పాంచల్‌ (67 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (33 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు.

ప్రస్తుతం భారత్‌ మరో 219 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 385/5తో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 160.3 ఓవర్లలో 7 వికెట్లకు 562 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. డేన్‌ క్లీవర్‌ (196; 20 ఫోర్లు, సిక్స్‌) త్రుటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. మార్క్‌ చాప్‌మ్యాన్‌ (114; 11 ఫోర్లు) శతకం సాధించాడు. భారత బౌలర్లలో ఇషాన్‌ పోరెల్, సందీప్‌ వారియర్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు