ఒకే వేదికపై భారత్‌తో టెస్టు సిరీస్‌! 

30 May, 2020 00:10 IST|Sakshi

ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోన్న సీఏ

మెల్‌బోర్న్‌: పరిస్థితులు అనుకూలించకపోతే భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఒకే వేదికపై నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ శుక్రవారం ప్రకటించారు. అవసరమైతే గురువారం ప్రకటించిన టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేస్తామని తెలిపారు. ‘ఇక్కడ అంతర్రాష్ట్ర సర్వీసులు నడిస్తే షెడ్యూల్‌ ప్రకారం సిరీస్‌ జరుపుతాం. అలా కాకుండా ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉంటే ఒకే వేదికపై మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తాం’ అని ఆయన అన్నారు.

షెడ్యూల్‌ ప్రకారం నాలుగు టెస్టులకు వరుసగా బ్రిస్బేన్‌ (డిసెంబర్‌ 3–7), అడిలైడ్‌ (11–15), మెల్‌బోర్న్‌ (26–30), సిడ్నీ (జనవరి 3–7) ఆతిథ్యమివ్వనున్నాయి. మరోవైపు ఈ ఏడాది జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే భారీ స్థాయిలో ఆదాయానికి గండిపడనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో వరల్డ్‌ కప్‌ నిర్వహణపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. టోర్నీ జరుగకపోతే రూ. 402 కోట్ల (80 మిలియన్‌ డాలర్లు) నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు