జయం మనదే

16 Oct, 2017 01:20 IST|Sakshi

పాక్‌పై 3–1తో భారత్‌ ఘనవిజయం

ఆసియా కప్‌ హాకీ

ఢాకా: దాయాది పాకిస్తాన్‌పై భారత హాకీ జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. అటు ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లోనూ హ్యాట్రిక్‌ విజయాలతో అదరగొట్టింది. ఆదివారం జరిగిన పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌లో భారత జట్టు 3–1తో పాక్‌ను ఓడించింది. దీంతో తొమ్మిది పాయింట్లతో టాప్‌లో నిలిచింది.

పాక్‌తో పోరులో గట్టి పోటీ ఎదురవుతుందని భావించినా భారత ఆటగాళ్లు అద్భుత రీతిలో చెలరేగి తొలి మూడు క్వార్టర్లలో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ జట్టుపై భారత్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. భారత్‌ తరఫున చిన్‌గ్లెన్‌సనా (17వ నిమిషంలో), రమణ్‌దీప్‌ సింగ్‌ (44వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (45వ ని.లో) గోల్స్‌ సాధించారు. పాకిస్తాన్‌ తరఫున ఏకైక గోల్‌ అలీ షాన్‌ (48వ ని.లో) చేశాడు.

ఈ మ్యాచ్‌కు ముందే రెండు వరుస విజయాలతో భారత జట్టు సూపర్‌–4 రౌండ్‌కు చేరింది. కొత్త ఫార్మాట్‌ ప్రకారం రెండు పూల్‌లో టాప్‌గా నిలిచిన జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ తరహాలో మ్యాచ్‌లు ఆడతాయి. అటు ఈ మ్యాచ్‌ ఓడినప్పటికీ పాకిస్తాన్‌ కూడా నాలుగు పాయింట్లతో తదుపరి దశకు చేరింది. సూపర్‌–4లో భారత్, పాక్, కొరియా, మలేసియా జట్ల మధ్య పోరాటం ఉంటుంది.  

తొలి రెండు క్వార్టర్లలో ఆధిపత్యం..
మ్యాచ్‌ ప్రారంభంలోనే భారత ఆటగాళ్ల నుంచి దూకుడైన ఆట కనిపించింది. మిడ్‌ ఫీల్డ్‌ నుంచి బంతిని తమ అదుపులో ఉంచుకుంటూ పాక్‌ గోల్‌పోస్టుపై దాడి చేసినప్పటికీ భారత జట్టు వారి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. తొలి పది నిమిషాలు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గట్టి పోటీనే కనిపించింది. 11వ నిమిషంలో భారత్‌కు గోల్‌ చేసే అవకాశం వచ్చింది. ఆకాశ్‌దీప్‌ బంతిని తన స్వాధీనంలో ఉంచుకుంటూ ముందుకెళ్లినా పాక్‌ ఆటగాళ్లు అడ్డుకోగలిగారు.

16వ నిమిషంలో పాక్‌కు తొలి పెనాల్టీ కార్నర్‌ లభించినా భారత ఆటగాళ్లు వారికి గోల్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. అయితే రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే భారత్‌ ఖాతా తెరిచింది. 17వ నిమిషంలో చిన్‌గ్లెన్‌సనా గోల్‌తో భారత్‌ 1–0 ఆధిక్యం సాధించింది. మరో రెండు నిమిషాల్లో గోల్‌ చేసే అవకాశం వచ్చినా తృటిలో తప్పింది. అటు 26వ నిమిషంలో పాకిస్తాన్‌కు రెండో పెనాల్టీ కార్నర్‌ అవకాశం దక్కింది.

అయితే భారత గోల్‌ కీపర్‌ సూరజ్‌ కర్కెరా అద్భుతంగా అడ్డుకోవడంతో పాక్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇక 28వ నిమిషంలో గుర్జంత్‌ సింగ్‌ దాదాపుగా గోల్‌ చేసినట్టే అనిపించినా బంతి కొద్ది తేడాతో వైడ్‌గా వెళ్లింది. ఈ సమయంలో పాక్‌ తమ దాడులను ఉదృతం చేసింది. కానీ కీపర్‌ సూరజ్‌ మాత్రం అప్రమత్తంగా ఉండడంతో పాక్‌ ప్రయత్నాలు ఫలించలేదు.

మూడో క్వార్టర్‌ ప్రారంభంలో రెండు నిమిషాల వ్యవధిలో పాక్‌ ఆటగాళ్లు రిజ్వాన్, అబు మహమూద్‌లకు రిఫరీ ఎల్లో కార్డు చూపించడంతో ఐదు నిమిషాలపాటు మైదానాన్ని వీడారు. దీంతో పాక్‌ కొద్దిసేపు తొమ్మిది మందితోనే ఆడాల్సి వచ్చింది. అటు పాక్‌ గోల్‌ ప్రయత్నాన్ని కీపర్‌ సూరజ్‌ మరోసారి వమ్ము చేశాడు. అయితే ఈ దశలో భారత్‌కు లభించిన పీసీ కూడా విఫలమైంది. వరుణ్‌ సంధించిన షాట్‌ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లింది. పాక్‌ కూడా తన పీసీని వృథా చేసుకుంది.

ఈ దశలో భారత ఆటగాళ్లు విజృంభించడంతో వెంటవెంటనే రెండు గోల్స్‌ నమోదయ్యాయి. 44వ నిమిషంలో రమణ్‌దీప్‌ సింగ్‌ గోల్‌ సాధించగా మరో నిమిషంలోనే తమకు లభించిన పీసీని హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ 3–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే పాకిస్తాన్‌ కూడా 49వ నిమిషంలో తమ ఖాతా తెరవగలిగింది. సర్దార్‌ సింగ్‌ పొరపాటును సొమ్ము చేసుకుంటూ అలీ షాన్‌ నేరుగా ఆడిన షాట్‌ భారత నెట్‌లోనికి వెళ్లింది.

ఆ వెంటనే మరో గోల్‌ కోసం విశ్వప్రయత్నం చేసిన పాక్‌ పీసీ కోసం రివ్యూకెళ్లింది. భారత డిఫెండర్‌ తమ ఆటగాడి స్టిక్‌ను అడ్డుకున్నాడని పాక్‌ ఆరోపణ చేసినా రివ్యూ కోల్పోయింది. చివరి పది నిమిషాల్లోనూ పాక్‌ పదేపదే దాడులు చేసినా కూడా ఫలితం లేకపోవడంతో పరాజయం ఖాయమైంది.

మరిన్ని వార్తలు